పదేళ్లు దోపిడీ చేసినందుకు ఓటు వేయాలా? | Mallu Bhatti Vikramarka election campaign in the Wyra and Madhira municipalities | Sakshi
Sakshi News home page

పదేళ్లు దోపిడీ చేసినందుకు ఓటు వేయాలా?

Feb 9 2026 3:11 AM | Updated on Feb 9 2026 3:11 AM

Mallu Bhatti Vikramarka election campaign in the Wyra and Madhira municipalities

బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క ఇల్లు, స్థలం ఇవ్వలేదు 

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  

వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం

వైరా/మధిర:మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాల­ని బీఆర్‌ఎస్‌ నాయకులు అడుగుతున్నారు.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నందుకు వారికి ఓట్లేయాలా. రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచినందుకు ఓట్లేయాలా’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో భట్టి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ ఇవ్వలేదని ఆరోపించారు. 

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. మళ్లీ ఇప్పుడు తాము వచ్చాకే మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.22,500 కోట్ల నిధులు వె చ్చిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలు రేషన్‌ కార్డుల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగితే పట్టించుకోలేదన్నారు. అప్పుడు ఇచ్చిన దొడ్డు బియ్యం పేదలకు ఉపయోగపడలేదని చెప్పారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాలకు గాను 1.02 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. 

అంతేకాక ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా రూ.27 వేల కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్‌ నాయుడు సత్యం, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement