కర్ణాటకలో కూలికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
12 మందికి తీవ్రగాయాలు
అన్నమయ్య జిల్లా పూలకుంట్లపల్లెలో విషాదం
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా నుంచి కర్ణాటకకు చింతకాయల కోత పనులకు వెళ్లిన కూలీల్లో ముగ్గురిని ప్రమాదం బలితీసుకుంది. బొలెరోలో వెళ్లినవారు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఆ వాహనం బోల్తాపడడంతో ఈ విషాదం నెలకొంది. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామంలోని పూలకుంట్లపల్లెకు చెందిన 15 మంది కూలీలు బొలెరో వాహనంలో కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద చింతకాయలు కోయడానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీనివాసపురం వద్ద బ్రేక్ ఫెయిలవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాసులు (25), మునెప్ప (65) అక్కడికక్కడే మృతిచెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురిని వేర్వేరు వాహనాల్లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు చికిత్స చేసేలోపే వెంకటమ్మ (60) మృతిచెందింది. ఆరుగురు మదనపల్లెలోను, మరో ఆరుగురు శ్రీనివాసపురంలో చికిత్స పొందుతున్నారు. కూలి పనులకు వెళ్లిన ముగ్గురు ప్రాణాలు కో ల్పోవడంతో పూలకుంట్లపల్లెలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై శ్రీనివాçసపురం పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కూలీలు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక శ్రీనివాసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కూలీలు మరణించడం విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.


