ఎన్‌డీడీబీ, సిట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి
అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టీకరణ
ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ‘ఎన్‌డీడీబీ, సిట్ నివేదికలలో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు’ అని ఆయన స్పష్టంచేశారు. జనసేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతరం ఆయన మాట మార్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదనే విషయాన్ని సాక్షాత్తూ ఆ స్వామివారే ఆయన నోట పలికించారని నెటిజన్లు, జనం అభిప్రాయపడుతున్నారు.


