క్రూయిజ్‌ రాకకు వేళాయే.. | Cordelia cruise ship at Vizag | Sakshi
Sakshi News home page

క్రూయిజ్‌ రాకకు వేళాయే..

Feb 9 2026 5:24 AM | Updated on Feb 9 2026 5:24 AM

Cordelia cruise ship at Vizag

విశాఖ క్రూయిజ్‌ టెర్మినల్‌కు రానున్న కార్డిలియా క్రూయిజ్‌ షిప్‌

జూన్‌ 24 నుంచి మూడుసార్లు వైజాగ్‌ టు చెన్నై వయా పుదుచ్చేరి మీదుగా సర్విసు 

వచ్చే ఏడాది కూడా ఏడుసార్లు నడవనున్న కార్డిలియా.. మరో సాగర విహారానికి సిద్ధమవుతున్న విశాఖ

సాక్షి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి సిద్ధమైంది. విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)లో నిర్మించిన క్రూయిజ్‌ టెర్మినల్‌ నుంచి క్రూయిజ్‌ సర్వీసులు అందించేందుకు కార్డిలియా క్రూయిజ్‌ షిప్‌ రాబోతోంది. సాగర జలాల్లో ఐదురోజుల పాటు విహరించనుంది. విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నైకి సర్వీసు నడిపేందుకు కార్డిలియా క్రూయిజ్‌ ఎంవీ ఎంప్రెస్‌ సిద్ధమవుతోంది. జూన్‌ 24న ఈ ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ షిప్‌ విశాఖ చేరుకోనుంది. రేట్లు, బెర్తింగ్‌ టైమ్స్‌ తదితర అంశాలపై ఇప్పటికే విశాఖ పోర్టు అధికారులతో సంస్థ ప్రతినిధులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు సర్విసులు నడపనుంది. వచ్చే ఏడాదిలోనూ ఇదే సమయంలో క్రూయిజ్‌ నడిపేందుకు అనుమతులు తీసుకుంది. 

ఫుడ్‌ కోర్టులు..షాపింగ్‌మాల్స్‌..లైవ్‌షోలు.. 
టెర్మినల్‌ ప్రారంభమైన తర్వాత మూడుసార్లు విశాఖ వచ్చిన కార్డిలియా క్రూయిజ్‌ ఎంవీ ఎంప్రెస్‌ జూన్‌ నెలాఖరున విశాఖ కేంద్రంగా సేవలందించేందుకు సిద్ధమైంది. మొత్తం 11 అంతస్తుల క్రూయిజ్‌ షిప్‌ జూన్‌ 20న మద్రాస్‌ నుంచి బయలుదేరి 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు విశాఖ చేరుకోనుంది. మళ్లీ అదే రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరి 26న ఉదయం పుదుచ్చేరి, అక్కడి నుంచి 27న చెన్నైకి చేరుకోనుంది.

నెల రోజుల పాటు ఈ సర్విసులు నడపనున్నారు. అంటే మొత్తంగా విశాఖ నుంచి జూన్‌ 24వ తేదీతో పాటు జులై 1, 8, 15 తేదీల్లో క్రూయిజ్‌ సర్విసులు నడవనున్నాయని వైజాగ్‌ పోర్టు అధికారులు తెలిపారు. ఈ షిప్‌లో 300 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. షిప్‌లో ఫుడ్‌ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్‌ క్లబ్, స్విమ్మింగ్‌ పూల్స్, ఫిట్‌నెస్‌ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్‌ బ్యాండ్, అడ్వెంచర్‌ యాక్టివిటీస్, షాపింగ్‌ మాల్స్, లైవ్‌షోలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్‌ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

వచ్చే ఏడాది సర్విసులకూ సిద్ధం
విలాసాల నౌక 2027లోనూ విశాఖ నుంచి సేవలందించేందుకు ముందస్తు బుకింగ్‌ని వైజాగ్‌ క్రూయిజ్‌ టెర్మినల్‌తో సిద్ధం చేసుకుంది. 2027 జూన్‌ 9న చెన్నైలో మొదలుపెట్టి వయా పుదుచ్చేరి మీదుగా వైజాగ్‌కు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ సమయంలో మాత్రం విశాఖకు ఏడుసార్లే కార్డిలియా క్రూయిజ్‌షిప్‌ రానుంది. మళ్లీ క్రూయిజ్‌ సేవలు మొదలవుతున్న తరుణంలో.. ప్రపంచ పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి.. మహా విశాఖ నగరంలో పర్యటించే విధంగా ఏర్పాట్లు చేసేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.

2500 చదరపు మీటర్ల టెర్మినల్‌ బిల్డింగ్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్‌వే, రెస్టారెంట్, స్పెషల్‌ లాంజ్, షాపింగ్, విశ్రాంత గదులు, టూరిజం ఆపరేటర్స్‌ కౌంటర్లను తెరవనున్నారు. భవిష్యత్‌లో క్రూయిజ్‌ సర్విసులు విశాఖ నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయనీ.. దానికనుగుణంగా ఏర్పాట్లు చేయడంపై పోర్టు అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement