లోకేశ్‌దే పెత్తనం.. టీడీపీలో సీనియర్లు ఔట్‌! | TDP seniors fire on Chandrababu | Sakshi
Sakshi News home page

లోకేశ్‌దే పెత్తనం.. టీడీపీలో సీనియర్లు ఔట్‌!

Feb 9 2026 5:48 AM | Updated on Feb 9 2026 6:55 AM

TDP seniors fire on Chandrababu

త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ అభ్యర్థుల రేసులో కిలారు రాజేష్‌ 

చినబాబు లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం పార్టీలో హవా

ఆయన్ను రాజ్యసభకు పంపి తన పట్టును మరింత పెంచుకునేందుకు లోకేశ్‌ ప్లాన్‌

తన మరో ప్రధాన అనుయాయుడు సానా సతీష్‌  రాజ్యసభ ఎంపీ పదవీ రెన్యూవల్‌కు అవకాశం

లాబీయిస్టులు, సొంత వ్యవహారాలు చక్కబెట్టే వారికే టీడీపీలో కీలక పదవులు

టీడీపీ సీనియర్లు యనమల, కంభంపాటి వంటి నేతలు సర్దుకోవాల్సిందేనని సంకేతాలు

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో లాబీయిస్టులకు ప్రాధాన్యం అంతకంతకూ పెరిగిపోతుండడంతో సీనియర్లు అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు, పార్టీ కోసం పని చేసిన వారిని పూర్తిగా పక్కనపెట్టి కేవలం తమకు అనుకూలంగా పని చేసే లాబీయిస్టులకే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ పెద్దపీట వేస్తున్నారని వారు మండిపడుతున్నారు. తాజాగా రాజ్యసభ అభ్యర్థుల విషయంలోనూ తండ్రీ కొడుకులు అదే పంథా అనుసరిస్తున్నారనే ఆవేదన పార్టీలో వ్యక్తమవుతోంది. త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి లేక రెండు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. 

అందులో ఒక స్థానాన్ని లోకేశ్‌ తన ప్రధాన అనుచరుడు కిలారు రాజేశ్‌కి ఇస్తున్నట్లు టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చినబాబు పలువురు పార్టీ ముఖ్యుల వద్ద చెప్పినట్లు సమాచారం. రాజేశ్‌ కూడా ఈ విషయాన్ని తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారికి చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో చినబాబు తరఫున అన్ని వ్యవహారాలూ రాజేశే నడిపిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. పదవులు, కాంట్రాక్టులు, బిల్లులు, పోస్టింగ్‌లు, బదిలీలు సహా ఏ పని జరగాలన్నా టీడీపీ నేతలు ఆయన్నే కలుస్తున్నారు. 

లోకేశ్‌తో మాట్లాడిన తర్వాత ఆ పని జరిగేలా చూసేది రాజేశే. 2014–19 మధ్య కూడా ఆయన హవా ఇలాగే నడిచింది. తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తి కావడంతో లోకేశ్‌ ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా తన పట్టును మరింత బిగించేందుకు చినబాబు యత్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్డీఏ ముఖ్య నేతలకు ఈ విషయాన్ని ఆయన చెప్పినట్లు సమాచారం. 

కోటరీ వ్యక్తులకిస్తే మా గతి ఏమిటీ? 
అయితే తెలుగుదేశం సీనియర్‌ నేతలు, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా కేవలం లోకేశ్‌ వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తిని రాజ్యసభకు పంపితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని అంతర్గతంగా రగిలిపోతున్నారు. అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్‌ రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యూవల్‌ చేయడం దాదాపు ఖాయమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

ఆయన కూడా లాబీయిస్టే. లోకేశ్‌కు సన్నిహితుడే. గత ఏడాది రెండు రాజ్యసభ స్థానాలు తమకు దక్కగా అందులో బీజేపీ, టీడీపీ చెరొకటి పంచుకున్నాయి. టీడీపీ కోటాలో సానాకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. లోకేశ్‌ కోటరీలో సానా కీలకంగా మారారు. దీంతో ఎంతోమంది సీనియర్లు ఉన్నా పక్కనపెట్టి సానా సతీ‹Ùను రాజ్యసభ ఎంపీగా చేశారు. ఆయన పదవీకాలం మే నెలలో ముగుస్తుండడంతో మళ్లీ రెన్యూవల్‌ చేసి రాజ్యసభ ఎంపీగా కొనసాగించడం లాంఛనమేనని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సీనియర్లకు అవమానమే ! 
నిజానికి రాజ్యసభ ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సూపర్‌ సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు చాలాకాలం నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రాజకీయ జీవితంలో గౌరవప్రదమైన ముగింపును కోరుకుంటున్న ఆయన రాజ్యసభ ఎంపీ అందుకు తగినదని భావించి ఆ దిశగా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన కూడా పట్టించుకోవడం లేదు. లోకేశ్‌ అయితే యనమలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని టీడీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న మరో సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహనరావు తనకు చివరి అవకాశంగా ఎంపీ పదవి ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.

గత ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం చేసిన గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ రాజ్యసభ స్థానం కోసం గట్టిగా యతి్నస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా యతి్నస్తున్నారు. పదవులు దక్కని నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, చింతకాయల విజయ్, వర్ల రామయ్య వంటి నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా చంద్రబాబు, లోకేశ్‌ నుంచి కనీస స్పందన కూడా లేదని సమాచారం. కేవలం లోకేశ్‌ కోటరీలోని లాబీయిస్టులు, లేకపోతే భారీగా నిధులు సమకూర్చే వారికే అవకాశం ఉంటుందని తేల్చి చెబుతుండడంతో సీనియర్లు అవమాన భారంతో రగిలిపోతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement