భారీగానా.. సర్దుబాటేనా? | Telangana government plans cautiously for 2026-27 budget | Sakshi
Sakshi News home page

భారీగానా.. సర్దుబాటేనా?

Feb 9 2026 6:08 AM | Updated on Feb 9 2026 6:08 AM

Telangana government plans cautiously for 2026-27 budget

2026–27 రాష్ట్ర బడ్జెట్‌ ఎలా ఉంటుందోననే ఆసక్తి

కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో రెండు వైపులా అవకాశాలు ఈసారి రూ.3.11 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్ల మధ్య ఉండే చాన్స్‌ 

భారీగా పెంపు, సర్దుబాటు సమీకరణాలతో ఆర్థిక శాఖ అంచనాలు 

పన్నుల్లో వాటా పెరుగుదల, 16వ ఆర్థిక సంఘం సిఫారసులు, సీఎస్‌ఎస్‌ ఆసరాగా భారీ పెంపునకు అవకాశం 

కేంద్ర బడ్జెట్‌ పరిమాణం, ద్రవ్యోల్బణ పరిస్థితులు, రాబడుల కోణంలో చూస్తే స్వల్ప పెంపుతో సరి 

ఈసారి సామాజిక పింఛన్ల పెంపు.. చేయూత పథకానికి నిధులు!

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ భారీగా పెరగబోతోందా.. స్వల్ప పెంపుతో సరిపెట్టుకుంటుందా అన్నది ఇప్పుడు ఆర్థిక శాఖ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనల నేపథ్యంలో రెండింటికీ అవకాశం ఉన్నందున.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏ కోణంలో బడ్జెట్‌ అంచనాలను ప్రతిపాదిస్తుంది? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల కొనసాగింపుతో పాటు సామాజిక పింఛన్ల పెంపునకు ఈసారి అవకాశం ఉందని, అదే సమయంలో ఎన్నికల సంవత్సరం కూడా కాదు కాబట్టి ఉన్న పథకాలకు నిధులు సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టి, ఆదాయ మార్గాలను అన్వేíÙస్తూ వాస్తవిక అంచనాలను రూపొందించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌ అంచనాలు.. 2026–27 సంవత్సరానికి కనిష్టంగా రూ.3.11 లక్షల కోట్లకు, గరిష్టంగా రూ.3.30 లక్షల కోట్లకు పెరిగే అవకాశముందని సమాచారం

పెంపు ప్రాతిపదికలివే..!
ఈసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలు భారీగానే ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను చూస్తే ఈ మేరకు వెసులుబాటు ఉందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో వాటా గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.4 వేల కోట్ల మేర పెరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 29,280 కోట్ల మేరకు పన్నుల్లో వాటా రాగా, 2026–27కు అది రూ. 33,181 కోట్లకు పెరిగింది. దీంతో పాటు 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మరో రూ.33 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్ల కాలంలో సమకూరుతాయి.

ఈ లెక్కన ఈ సంవత్సరంలో కనీసం రూ.6 వేల కోట్లు వస్తాయి. ఈ రెండు పద్దులతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) పద్దు కూడా గతంతో పోలిస్తే పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 2025–26 ఆర్థిక సంవత్సరంలో సీసీఎస్‌ల కోసం రూ.22 వేల కోట్ల వరకు కేంద్రం నుంచి వచ్చాయని, ఈసారి రూ.30 వేల కోట్ల అంచనా ఉందని తెలుస్తోంది. ఈ మూడు వెసులుబాట్లతో కనీసం రూ.18 వేల కోట్లు అదనంగా వస్తాయని అంచనా.

వీటికి తోడు రాష్ట్ర సొంత పన్నుల రాబడుల్లో వార్షిక వృద్ధి అంచనాలు, ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్న భూముల ప్రభుత్వ విలువల సవరణ, భూముల అమ్మకాలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగా పలు పథకాల్లో అదనపు నిధులు కేంద్రం నుంచి తెచ్చుకునే అవకా శం ఉంది. ఈ అంచనాల ఆధారంగా ఈసారి బడ్జెట్‌ గరిష్టంగా రూ.25 వేల కోట్ల వరకు పెరిగే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

పింఛన్లు పెరుగుతాయంట!
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీని ఈసారి బడ్జెట్‌లో నెరవేర్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. చేయూత పథకం కింద పలు వర్గాలకు ఇస్తున్న సామాజిక పింఛన్లను పెంచుతారని, ఈ మేరకు చేయూత పథకానికి నిధులు కేటాయింపు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేయూత పథకానికి రూ.14,861 కోట్లు కేటాయించారు. వీటి నుంచి రాష్ట్రంలోని 43 లక్షల మంది పింఛన్‌దారులకు నెలకు రూ.1,150 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. 

అయితే 2026–27 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్, 2026 నుంచి సామాజిక పింఛన్లు కనీసం రూ.500 పెంచుతారని సమాచారం. ఇందుకోసం అదనంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు చేసింది. రూ.500, రూ.750, రూ.1,000 పెంపు వల్ల అయ్యే అదనపు ఖర్చును దృష్టిలో ఉంచుకుని..ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా ఈసారి బడ్జెట్‌లో చేయూత పింఛన్ల బడ్జెట్‌ పరిమాణం పెరగనున్నట్టు సమాచారం.  

సర్దుబాటు సమీకరణలతో అంచనాలు 
అదే సమయంలో ఉన్నదాంట్లో సర్దుబాటు చేసుకునే సమీకరణలను కూడా ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం 2 శాతం కంటే తక్కువగా ఉండడంతో ఎలాంటి ఆర్భాటాలు లేని కేంద్ర బడ్జెట్‌ పరిమాణం అంచనా కూడా రూ.4 లక్షల కోట్ల వరకు మాత్రమే పెరిగింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ రాబడులు కూడా పెద్దగా పెరగలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండగా, వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో పన్ను వసూళ్లు 72 శాతానికి అటూ ఇటుగా ఉన్నాయి. ఈ రాబడులు గరిష్టంగా మరో 20 శాతం వరకు పెరుగుతాయని అంచనా.

అంటే 2025–26 వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో 12–15 శాతం మేర తగ్గుదల నమోదయ్యే అవకాశముంది. అంటే రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌కు గాను రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.80 లక్షల కోట్ల వరకు సవరణల బడ్జెట్‌ వచ్చే అవకాశముందని అంటున్నారు. ముఖ్యంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, పన్నేతర ఆదాయం పద్దులు బలహీనంగా ఉన్నా యి. ఈ పద్దుల కింద ఆశించిన దాంట్లో 50 శాత మైనా వస్తాయా అన్నది అనుమానమే. ఎలాగూ ఎన్నికల సంవత్సరం కాదు కనుక ఉన్న పథకాలకు నిధులు సర్దుబాటు చేసి, బలహీనంగా ఉన్న పద్దులను హేతుబదీ్ధకరించాలనే ఆలోచనతో బడ్జెట్‌ను కూర్చితే 2026–27 వార్షిక బడ్జెట్‌లో గరిష్టంగా ఏడెనిమిది వేల కోట్ల పెరుగుదలకు మాత్రమే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.  

ఈనెల 16 నుంచి సన్నాహక భేటీలు ?
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కావాల్సిన నిధులపై ప్రభుత్వ శాఖల వారీగా ప్రతిపాదనలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఆర్థిక శాఖకు చేరాయి. ఈ ప్రతిపాదనలు వడపోసిన ఆర్థిక శాఖ వాస్తవానికి, గత నెల 24వ తేదీ నుంచే బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించాలని భావించింది. ఈ మేరకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు శాఖల వారీగా షెడ్యూల్‌ కూడా జారీ అయింది. కానీ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బిజీ షెడ్యూల్, మేడారం జాతర, మంత్రివర్గ భేటీ, సీఎం విదేశీ పర్యటన తదితర కారణాలతో ఈ షెడ్యూల్‌ అమలు కాలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల అనంతరం నిర్వహిస్తారని, ఈనెల 16వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల అనంతరం మార్చి 10వ తేదీ లోపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని, 7–10వ తేదీలోపు అసెంబ్లీలో 2026–27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాల సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement