వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త! వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లోని తాజా సమాచారం ప్రకారం.. 19 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ .10 తగ్గింది. కొత్త రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర గత నెలలోని రూ.1,590.50 నుంచి రూ.1,580.50కు తగ్గింది.
కోల్కతాలో కొత్త ధర రూ.1,694 నుంచి రూ.1,684కు తగ్గింది.
ముంబయిలో గత నెలలో రూ.1,542గా ఉన్న ధర రూ.1,531.50కి దిగొచ్చింది.
చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,750 నుంచి రూ.1,739.50కు తగ్గింది.
హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1,746 నుంచి రూ.1,736కు తగ్గింది.
విశాఖపట్నంలో కొత్త ధర రూ.1,722. ఇది గత నెలలో రూ.1,732 ఉండేది.
ఇంధన రిటైలర్లు కమర్షియల్ ఎల్‌పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సర్దుబాటు చేస్తాయి. అయితే గృహావసరాలకు వినియోగించే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ల (14.2 కిలోలు) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.


