ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (IITMIC) భారతీయ డీప్‌టెక్ వ్యవస్థాపక రంగంలో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కేవలం 12 సంవత్సరాల్లో 500 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేసిన ఏకైక అకడమిక్ ఇంక్యుబేటర్‌గా ఐఐటీఎంఐసీ రికార్డు సృష్టించింది. ఇంక్యుబేట్ చేసిన ఈ స్టార్టప్‌ల సమష్టి విలువ (వాల్యుయేషన్) రూ.53,000 కోట్లు దాటడం దేశ డీప్‌టెక్ ఎకోసిస్టమ్ బలోపేతాన్ని సూచిస్తోంది. 2012-13లో అకడమిక్ ఇంక్యుబేటర్లు అరుదుగా ఉన్న సమయంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఐటీఎంఐసీ ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ, యునిఫోర్, అగ్నికుల్ కాస్మోస్, మెడిబడ్డీ, మైండ్‌గ్రోవ్.. వంటి అనేక స్టార్టప్‌లకు పుట్టినిల్లు అయింది.
స్టార్టప్ కంపెనీల పరంగా ఇంక్యుబేషన్ అంటే.. కొత్తగా ప్రారంభమైన లేదా ప్రాథమిక దశలో ఉన్న కంపెనీ (స్టార్టప్‌కు) విజయవంతంగా ఎదగడానికి, స్వతంత్రంగా పనిచేయడానికి అవసరమైన మద్దతు, వనరులు, సర్వీసులను అందించే ప్రక్రియ. సాధారణంగా దీన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రత్యేక ఇంక్యుబేటర్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇంక్యుబేషన్ అనేది ప్రారంభ సంవత్సరాల్లో స్టార్టప్‌కు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడే ఒక సమగ్ర మద్దతు వ్యవస్థ.
ఈ సందర్భంగా ఐఐటీఎంఐసీ సీఈవో తమస్వతి ఘోష్ మాట్లాడుతూ..‘మేము 500 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేశాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ స్టార్టప్‌ల్లో దాదాపు 60 శాతం మంది ఐఐటీ బయటినుంచి వచ్చిన వారున్నారు. ఇది ఐఐటీఎంఐసీని నిజమైన జాతీయ స్థాయి డీప్‌టెక్ కేంద్రంగా మార్చింది’ అని తెలిపారు.
ఐఐటీఎంఐసీ పోర్ట్‌ఫోలియో వివరాలు..
ఇంక్యుబేటెడ్ కంపెనీలు సుమారు 700 పైగా పేటెంట్లను దాఖలు చేశాయి.
105 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ప్రీ-సిరీస్/సిరీస్ A+ రౌండ్‌ల్లో విజయవంతంగా నిధులను సేకరించాయి.
దాదాపు 40 శాతం స్టార్టప్‌లు ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు కలిసి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.
ఏథర్ ఎనర్జీ ఐపీఓ సమయంలో ఐఐటీఎంఐసీ నుంచి తాత్కాలికంగా నిష్క్రమించడం ద్వారా భారీగా రిటర్న్‌ను అందించింది.
రాబోయే 4-5 ఏళ్లలో మరో 10-15 కంపెనీలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉందని ఘోష్ అంచనా వేశారు.
కీలక రంగాలపై దృష్టి
ఐఐటీఎంఐసీ పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ టెక్, బయోటెక్, మొబిలిటీ, ఐఓటీ, క్లీన్ ఎనర్జీ వంటి కీలక డీప్‌టెక్ రంగాల్లో విస్తరించింది. ఇది దేశం వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఉంది. నాణ్యతతో కూడిన స్టార్టప్‌ల సంఖ్యను పెంచేందుకు, ప్రీ-ఇంక్యుబేషన్ దశలోనే బలమైన మద్దతు అందించే ‘నిర్మాణ్’ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 120కి పైగా ప్రీ-వెంచర్ టీమ్‌లను ప్రోత్సహిస్తోంది. అదనంగా, స్టార్టప్ స్నేహపూర్వక విధానంలో భాగంగా గతంలో 5 శాతం తీసుకున్న ఈక్విటీని ఐఐటీఎంఐసీ ఇప్పుడు 3 శాతానికి తగ్గించింది. పూర్వవిద్యార్థుల విరాళాలు, కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధులు దీనికి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా?


