
ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే నిరంతరం పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు సామాన్యులకు ఒక సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టేందుకు అనుసరించే సంప్రదాయ పద్ధతులు, ఖర్చు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలు, కొత్త సాంకేతికతలపై సమగ్ర అవగాహన అవసరం.
సంప్రదాయ విధానం
భారతదేశంలో ఇళ్లు కట్టడానికి శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులు ప్రధానంగా స్థానికంగా లభించే వస్తువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. కాల్చిన ఎర్ర ఇటుకలు, సిమెంటు, ఇసుక మిశ్రమంతో (మోర్టార్) గోడలను నిర్మించడం.. దీనిపై కాంక్రీటు (RCC) స్లాబ్‌తో పైకప్పు వేయడం సాధారణంగా వస్తున్న ఆనవాయితి. ఇది దృఢమైన, మన్నికైన పద్ధతి. ఇటుక గోడలు ఉష్ణ బంధకాన్ని (Thermal Insulation) అందించి వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. అయితే దీని నిర్మాణం శ్రమతో కూడుకుంది. సమయం ఎక్కువ పడుతుంది. పునాది ఖర్చు ఎక్కువ. ఇటుకల తయారీ పర్యావరణంపై ప్రభావం చూపుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో మట్టి, గడ్డి, వెదురు, కలప, రాళ్లను ఉపయోగించి ఇళ్లను నిర్మించేవారు. కచ్చా ఇళ్లుగా పిలిచే ఈ విధానంలో ‘కాబ్’ (మట్టి, గడ్డి మిశ్రమం), ‘అడోబ్’(ఎండబెట్టిన మట్టి ఇటుకలు) వంటి పద్ధతులను వాడేవారు. వీటికి ఖర్చు తక్కువ. వీటి వల్ల పర్యావరణహితం, ఉష్ణ నియంత్రణ (Thermal Regulation) ఉంటుంది. అయితే వీటి మన్నిక తక్కువ. తరచుగా మరమ్మత్తులు అవసరం. భారీ వర్షాలకు అంతగా నిలబడవు.
రాతి నిర్మాణం
స్థానికంగా లభించే రాళ్లను సున్నం లేదా మట్టి మోర్టార్‌తో కలిపి గోడలు కట్టేవారు. ఇవి దృఢమైనవి. దీర్ఘకాల మన్నిక, సహజ ఉష్ణ బంధక సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటి నిర్మాణానికి ఎక్కువ శ్రమ అవసరం. ఎక్కువ సమయం పడుతుంది.
ఇంటి నిర్మాణ వ్యయం తగ్గించే పద్ధతులు
నిర్మాణ సాంకేతికతలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఖర్చును తగ్గించి, సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి.
ప్రిఫ్యాబ్రికేషన్, మాడ్యులర్ నిర్మాణం
గోడలు, పైకప్పు స్లాబులు, కిటికీలు వంటి భవన భాగాలను ఫ్యాక్టరీలో ముందుగా తయారు చేయించి ఆపై నిర్మాణ స్థలంలో వాటిని నేరుగా బిగించవచ్చు. దీంతో నిర్మాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. శ్రమ తక్కువ. నాణ్యతలో స్థిరత్వం ఉంటుంది. వ్యర్థాలు తగ్గుతాయి.
ఇన్సులేటెడ్ కాంక్రీట్ ఫారమ్‌లు
ఇది థర్మాకోల్ లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్‌తో చేసిన బోలు బ్లాకులను ఉపయోగించి గోడలను నిర్మించే విధానం. ఈ బోలు బ్లాకుల మధ్య తర్వాత కాంక్రీటు పోస్తారు. దీని వల్ల గోడలకు అధిక ఇన్సులేషన్ (ఉష్ణ బంధకం) లభిస్తుంది. ఇంట్లో ఉష్ణోగ్రత నియంత్రణ సులభమై ఎయిర్ కండీషనర్ల వినియోగం, తద్వారా విద్యుత్ బిల్లులు తగ్గుతాయి.
స్టీల్ ఫ్రేమ్ నిర్మాణం
స్టీల్ కాలమ్స్, బీమ్‌లను ఉపయోగించి భవనానికి ప్రధాన ఫ్రేమ్‌ను నిర్మించే విధానం. ఈ నిర్మాణం తేలికగా, దృఢంగా ఉంటుంది. భూకంపాలను తట్టుకోగలదు. నిర్మాణ సమయం తక్కువ.
ఫ్లై యాష్ ఆధారిత ఇటుకలు/ బ్లాకులు
థర్మల్ పవర్ ప్లాంట్‌ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం (ఫ్లై యాష్), ఇతర బైండర్లను ఉపయోగించి ఇటుకలు, బ్లాక్‌లను తయారు చేసే విధానం. ఉదాహరణకు ఏఏసీ బ్లాక్‌లు. ఇవి సాంప్రదాయ ఇటుకల కంటే తేలికైనవి. మెరుగైన ఉష్ణ బంధకాన్ని అందిస్తాయి. సిమెంట్ వినియోగాన్ని తగ్గిస్తాయి. పర్యావరణహితమైనవి.
ఇంటి నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కేవలం వస్తువుల ధరలు మాత్రమే కాకుండా నిర్మాణ ప్రణాళిక, డిజైన్, సాంకేతికతలో మార్పులు తీసుకురావడం ముఖ్యం. సంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లోని మన్నికను, స్థానిక వస్తువుల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రిఫ్యాబ్రికేషన్, ఏఏసీ బ్లాక్‌లు, సమర్థవంతమైన డిజైన్ వంటి ఆధునిక, తక్కువ ఖర్చు పద్ధతులను అనుసరించడం ద్వారా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు.
ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?