
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ధన త్రయోదశి (ధన్‌తేరాస్) రోజున బంగారం కొనడం భారతదేశంలో ఒక శుభప్రదమైన సంప్రదాయం. ఈ రోజున పసిడిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం పొడవునా సంపద సమకూరుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి, రూపాయి విలువ పతనం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా బంగారు ఆభరణాలు కొనడం కంటే మెరుగైన, ఆర్థికపరంగా లాభదాయకమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.
నేరుగా ఆభరణాలు కొంటే..
ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకోవడం చాలా మందికి ఆర్థిక భారంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా చిన్న వస్తువు కొనుగోలుకు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. బంగారు ఆభరణాల తయారీలో తరుగు రూపంలో కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. వీటికి తయారీ ఛార్జీలు (Making Charges) అదనం. బంగారం ధర, తయారీ ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆభరణాలు అమ్మినప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు కారణంగా కొనుగోలు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంది.
ఈ ఛార్జీలు, నష్టాల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి నిపుణులు మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన, పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌లు
గోల్డ్ ఈటీఎఫ్‌లు అనేవి స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో షేర్ల మాదిరిగా ట్రేడ్ చేయబడే ఫండ్‌లు. ఇవి దేశీయ భౌతిక బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. వీటిని లైవ్ మార్కెట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు ఉండవు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. భౌతిక బంగారంలాగా దొంగిలించబడుతుందనే భయం ఉండదు. రియల్ టైమ్ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా అవసరం.
డిజిటల్ గోల్డ్
PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని కొద్ది మొత్తంలో డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారం మీ తరపున భౌతిక రూపంలో లాకర్‌లో నిల్వ చేస్తారు. అయితే అమ్మాలనుకుంటే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విధానంలో చాలా తక్కువ డబ్బుతో కూడా కొంత మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. భౌతికంగా నిల్వ చేయాలనే ఆందోళన అవసరం లేదు. అయితే దీనికి కొనుగోలు పరిమితులు ఉంటాయి. ఈ పెట్టుబడి RBI లేదా SEBI నియంత్రణలో ఉండదని గమనించాలి.
ఇదీ చదవండి: లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..