ఏపీలో పెట్టుబడులు పెట్టలేం.. మీ భూములు మాకొద్దు!
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేటాయించిన భూములను రద్దు చేసుకుని పారిపోతున్న కంపెనీలు
రెడ్‌బుక్ రాజ్యాంగంలో హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు
కోకోకోలా కంపెనీకి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు
కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి తెలంగాణకు కోకోకోలా పరార్
‘అనంత’లో గతేడాది కేటాయించిన 121.53 ఎకరాలు వెనక్కి ఇచ్చేసిన ‘జిన్‌ఫ్రా’
శ్రీసత్యసాయి జిల్లా నుంచి ‘ఆజాద్ మొబిలిటీ’ పరుగోపరుగు
అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తీసుకోని జ్యూపిటర్ రెన్యువల్ ఎనర్జీ
నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకున్న నాల్కో – మిథాని
ఇండియా సిమెంట్స్, అదానీ, చెట్టినాడ్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు కంపెనీలకు కప్పం కోసం టీడీపీ కూటమి నేతల వేధింపులు
సాక్షి, అమరావతి: ‘‘మీ కప్పాలు కట్టలేం.. మీ బెదిరింపులు భరించలేం.. మీ భూములు వద్దు.. మీకో దండం..!’’ అంటూ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి! రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖంమీదే విసిరి కొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు! చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో ఊహించవచ్చని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు.
గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్ ఇండియా మొబిలిటీ, జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్‌ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి నాలుగు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మన రాష్ట్రం ఏకంగా రూ.6,096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందని స్పష్టం చేస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట పారిశ్రామికవేత్తలను బెదిరించడం.. తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తూనే రెడ్‌బుక్ రాజ్యాంగానికి పని కల్పిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు, కథనాలు ప్రచురిస్తూ జిందాల్, అదానీలపై తమ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం కథనాలను ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు.
వైఎస్‌ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూపు నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులను తమకు కమీషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు సంస్థ కార్యాలయంపై రాళ్ల దాడి చేసి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని గాయపర్చారు. ఇక అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంతగా బరితెగించారో వేరే చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలైతే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్రానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోందని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. 
ఉత్తరాంధ్ర నుంచి ‘సీమ’ దాకా సేమ్ సీన్..
శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున నెలకు సుమారు రూ.1.50 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహిరంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. ఆరీ్టపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్టు తమకు కావాలంటే తమకు కావాలంటూ కొట్టుకోవడంతో ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదేపార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పారీ్టకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.
బైబై చెప్పేసిన కోకోకోలా..
అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.1,200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వం దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలను ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతల కప్పాల వసూళ్లతో జంకిన కోకోకోలా పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకొని తెలంగాణకు తరలిపోయింది. తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరిట భూ సమీకరణ చేయవద్దని మొర పెట్టుకుంటూ కోకోకోలా కంపెనీ లేఖ రాసింది. 2026 ఫిబ్రవరి 27న కోకోకోలాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తొలి ఒప్పందానికే దిక్కులేదు..
బాబు సర్కారు అధికారం చేపట్టిన తరువాత 2024 నవంబర్ 19న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం జరిగింది. రూ.85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక్క ఎలీజీ ఎల్రక్టానిక్స్ మినహా మరే ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలు ఎక్కకపోగా ఆమోదం పొందిన ప్రతిపాదనలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి.
వడ్డీతో సహా ‘ఆజాద్’ వసూలు..!
శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈఎండీ కింద అజాద్ మొబిలిటీ చెల్లించిన రూ.2.51 కోట్లు 2024 ఆగస్టు 30 నుంచి వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
జిన్‌ఫ్రా.. పరుగో పరుగు!
రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్‌లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్‌తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ జిన్‌ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదన సమర్పించింది. ఎస్‌ఐపీబీ 7వ సమావేశంలో కూటమి సర్కారు దీన్ని ఆమోదించింది. అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షలు చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగంతో బెంబేలెత్తి వెనక్కి వెళ్లిపోయింది. తమకు కేటాయించిన భూములను రద్దు చేయాలంటూ లేఖ రాసింది. దీంతో జిన్‌ఫ్రాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2026 ఫిబ్రవరి 27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నాల్కో మిథాని యూనిట్ ప్యాకప్...!
కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రానికి కొత్త పీఎస్‌యూ ప్రాజెక్టులను తేకపోగా గతంలో ఏపీకి వచ్చిన వాటిని కూడా చంద్రబాబు సర్కారు వెళ్లగొడుతోంది. రెండు కేంద్ర ప్రభుత్వ రంగ కీలక సంస్థలు నాల్కో, మిథాని కలిసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ నెలకొల్పేలా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ ప్రాజెక్టు గురించి నాల్కో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ కూటమి పెద్దలు దీనిపై కనీసం స్పందించకపోవడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు. ప్రైవేటు కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంతులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు ఏపీ నుంచి వెనక్కు వెళ్లిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జారుకున్న ‘జూపిటర్..’
అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీ 6వ సమావేశంలో ఆమోదం లభించింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలను కేటాయిస్తూ 2025 మే 23న జీవో ఎంఎస్ నెంబర్ 85 జారీ అయింది. ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండా ఆ భూములు తమకొద్దని.. రూపాయి కూడా చెల్లించేది లేదని జూపిటర్ కుండబద్ధలు కొట్టింది. తమ పేరు మీద భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరింది. దీంతో జూపిటర్‌కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.


