ముగ్గురు యువకుల్ని బలిగొన్న అతి వేగం | Road Accident In Eluru | Sakshi
Sakshi News home page

ముగ్గురు యువకుల్ని బలిగొన్న అతి వేగం

Mar 3 2026 4:51 AM | Updated on Mar 3 2026 4:51 AM

Road Accident In Eluru

కాలేజీ బస్సును ఢీకొట్టిన బైక్‌  

ఏలూరులో ప్రమాదం 

ఏలూరు టౌన్‌: కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బైక్‌పై వేగంగా వెళ్తూ, వేగంగా వస్తున్న కళాశాల బస్సును ఢీకొట్టడంతో పైకెగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రగాయాలై చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు ఏలూరు నుంచి జానంపేట వైపు వేగంగా వెళుతుండగా.. ఎఫ్‌సీఐ గోడౌన్స్‌ వద్ద మోటార్‌ సైకిల్‌పై ఎ­దురుగా వస్తున్న ముగ్గురు యువకులు బస్సును వే­గంగా ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు యు­వకులూ ఎగిరి రోడ్డుపై పడటంతో తలలకు తీవ్రమై­న గాయాలై ఘటనా స్థలంలోనే ప్రా­ణాలు కోల్పో­యారు. సమాచారం అందుకు­న్న ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరు­కు­ని పరిస్థితిని పరిశీలించారు. పెదవేగి సీఐ రాజశేఖ­ర్, ఏలూ­రు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ ట్రాఫిక్‌­ను క్లియ­ర్‌ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.  

ముగ్గురూ కష్టజీవులే 
కష్టపడి పనిచేస్తూ కుటుంబాలను పోషించుకునే ముగ్గురు యువకులు ఒక్కసారే రోడ్డు ప్రమాదంలో మృతిచెందటంతో విషాదఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఏలూరు రూరల్‌ బీడీ కాలనీకి చెందిన చిట్టి ఆంజనేయులు (23) గ్రానైట్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన బొంతు దుర్గారావు (24) పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నాడు. ఎస్‌కే అహ్మద్‌ (25)ఏలూరులోనే తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరంతా జానంపేట వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement