తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ | Devotees Clash In Queue Line Near Krishna Teja Guest House At Tirumala, Check More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ

Mar 3 2026 4:48 AM | Updated on Mar 3 2026 11:49 AM

Devotees clash in queue at Tirumala

తిరుమల క్యూలైన్లో గొడవ పడుతున్న భక్తులు

తిరుమల: తిరుమలలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోని క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉన్న సమయంలో ఇద్దరు భక్తుల మధ్య చిన్న మాట పట్టింపు క్రమంగా పెద్ద గొడవకు దారితీసింది. ప్రత్యక్షంగా తెలిపిన వారి వివరాలు మేరకు.. క్యూలో ముందుకు వెళ్లే విషయంలో ఇద్దరు భక్తుల మధ్య వాగ్వివాదం మొదలైంది. క్షణాల్లోనే అది తోపులాటగా మారింది. ఒకరిపై మరొకరు తిట్ల దండకం అందుకుంటూ దాడులకు దిగారు. ఈ క్రమంలో ఓ భక్తుడు తన బెల్ట్‌ను తీసి మరో భక్తుడిపై దాడిచేయడం అక్కడ ఉన్న వారిని ఉలిక్కిపడేలా చేసింది.

ఈ ఘటనతో మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న ఇతర భక్తులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించినా, కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘటనతో క్యూలైన్‌లో కొంతసేపు దర్శన ప్రక్రియకు అంతరాయం కలిగింది. భద్రతా సిబ్బంది,  శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం కావడంతో ఘర్షణను నిలువరించగలిగారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి భక్తులను దర్శనానికి క్యూలో పంపించారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఘర్షణకు దిగడం సమంజసం కాదని టీటీడీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. క్యూలైన్‌ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement