లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే.. | BR Shetty’s ₹87,936 Crore Empire Sold for ₹74 — The Rise and Fall of a UAE Billionaire | Sakshi
Sakshi News home page

లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..

Oct 17 2025 2:33 PM | Updated on Oct 17 2025 3:00 PM

How BR Shetty indian UAE business icon lost his 10 billion USD empire

పచ్చనోటు మనిషి జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుంది. డబ్బుపై ఆశ కడు పెదరికంలో ఉన్న వ్యక్తిని సైతం రాజును చేయగలదు. ఆ ఆశ కొద్దిగా మితిమీరితే అదే డబ్బు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుంది. ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్‌ శెట్టి జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆ ఆశే తన రూ.87,936 కోట్ల(అంచనా) విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్‌లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.

స్టాక్ ఎక్స్ఛేంజీలో..

శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్‌కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్‌తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్‌ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.

వ్యాపారాల జాబితా..

శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్‌లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.

అనధికార నగదు లావాదేవీలు

2019లో ఎన్‌ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్‌ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.87,936 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.

ఇతర కంపెనీలపై ప్రభావం

ఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్‌లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.

పడిపోయిన ఆస్తుల విలువ

బ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement