
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు గుప్పించారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారా? అనే చర్చ మొదలైంది.
యూకే ప్రధాని హోదాలో కీర్ స్టార్మర్ తొలిసారిగా భారత్ పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు.
Namaskar doston నమస్కారం మిత్రులారా.. అంటూ హిందీలో యూకే ప్రధాని స్టార్మర్ తన ప్రసంగం ప్రారంభించారు. 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఇందుకుగానూ ప్రధాని నాయకత్వాన్ని అభినందిస్తున్నానని అన్నారాయన. అలాగే.. 2047 వికసిత్ భారత్ అనేది అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చడమేనని అన్నారాయన. ఇక్కడ నేను చూసిన ప్రతిదీ మీరు(మోదీని ఉద్దేశించి..) ఆ లక్ష్యాన్ని సాధించగలరన్న నమ్మకాన్ని నాకు కలిగించింది. ఆ ప్రయాణంలో మేము భాగస్వాములుగా ఉండాలనుకుంటున్నాం అని స్టార్మర్ (UK PM) ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. రష్యా ఆయిల్ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత ఎకానమీని డెడ్ అంటూ ట్రంప్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు అందుకు కౌంటర్‌గా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో యూకే-భారత్ మధ్య ఆర్థిక సహకారం, టెక్నాలజీ, వాణిజ్యం, విద్య రంగాల్లో సహకారం ప్రధానంగా UK–India Free Trade Agreement (FTA)పై చర్చ జరిగింది.
ఇదీ చదవండి: భారత్‌తో యుద్ధం తప్పదు!