వాషింగ్టన్ డీసీ: ‘గ్రీన్‌లాండ్ మాక్కావాల్సిందే. అమెరికా భద్రత దృష్ట్యా ఇది అత్యంత కీలకం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ’నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నారు.
ఇందులో భాగంగా.. ట్రంప్ ప్రభుత్వం గ్రీన్‌లాండ్‌లో నివసిస్తున్న మొత్తం 57వేల మంది జనాభాలో ఒక్కొక్కరికి పదివేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు వెచ్చించేందుకు సిద్ధమైంది. మొత్తంగా 53 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నారు.
వారికి డబ్బులు ఇవ్వడమే కాదు గ్రీన్‌లాండ్ నుంచి అమెరికాకు తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల, ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే గ్రీన్‌లాండ్ వాసులకు ఈ మొత్తాన్ని ముట్టజెప్పనున్నారు. నగదు చెల్లింపులతో పాటు దౌత్య ఒప్పందాలు, సైనిక శక్తి వినియోగం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
ఎందుకంత ఆసక్తి?
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఆసక్తి వెనక బోలెడన్ని కారణాలున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా.
అపార ఖనిజ నిల్వలు
గ్రీన్‌లాండ్ అపారమైన ఖనిజ, చమురు, సహజవాయు నిల్వలకు ఆలవాలం. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్‌లాండ్‌లో అపారంగా ఉన్నట్టు తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకమన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్‌లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషే«ధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్‌లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచన. ఇక గ్రీన్‌లాండ్‌లో చమురు, సహజవాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా, పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం.
అతి పెద్ద ద్వీపం
గ్రీన్‌లాండ్ (Greenland) ప్రపంచంలోనే అతి పెద్ద దీవి. 1953లో డెన్మార్క్‌లో భాగంగా మారింది. అయితే 2009లో దానికి విస్తృత స్వయంపాలిత ప్రతిపత్తి దక్కింది. దాని ప్రకారం గ్రీన్‌లాండ్‌వాసులు రిఫరెండం ద్వారా పూర్తి స్వాతంత్య్రం పొందవచ్చు కూడా. కాకపోతే అదిప్పటికీ డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ఇంతా చేస్తే గ్రీన్‌లాండ్ జనాభా కేవలం 57 వేలు!


