సంచలనం రేపిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు(తంత్రి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్ట్ చేసింది. వరుస నోటీసులకు స్పందించని ఆయన్ని.. శుక్రవారం విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది.
శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ప్రధాన అర్చకుడు రాజీవరు అరెస్టుతో ఆ సంఖ్య 11కి చేరింది.
SIT arrests Sabarimala Chief Priest Kandararu Rajeevaru in gold loss case
— Press Trust of India (@PTI_News) January 9, 2026
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పద్మకుమార్, ఉన్నికృష్ణన్ పొట్టి వాంగ్మూలాల మేరకు సిట్ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి తంత్రి రాజీవరును ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. వీలైనంత త్వరగా.. కొల్లంలోని కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన తంత్రిని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదు. గత ఏడాది నవంబరులో కూడా సిట్ ఆయన్ని విచారణ జరిపింది. అయితే..
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమల కాంట్రాక్టులకు తీసుకొచ్చింది కందరారు రాజీవర్ అని పద్మకుమార్ తదితరులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ వాంగ్మూలాల ఆధారంగా ఈ రోజు ఉదయం రాజీవర్‌ను సిట్ కార్యాలయానికి పిలిపించారు. రెండున్నర గంటల పాటు విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు సిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారు
1. ఉన్నికృష్ణన్ పొట్టి (స్పాన్సర్)
2. మురారిబాబు (మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దేవస్వం బోర్డు)
3. డి.సుధీష్ కుమార్ (మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)
4. కెఎస్ బైజు (తిరువాభరణం మాజీ కమిషనర్)
5. ఎన్.వాసు (మాజీ దేవస్వం కమిషనర్, అధ్యక్షుడు)
6. ఎ.పద్మకుమార్ (మాజీ దేవస్వం బోర్డు అధ్యక్షుడు)
7. ఎస్.శ్రీకుమార్ (మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)
8. పంకజ్ భండారి (సీఈవో, స్మార్ట్ క్రియేషన్స్)
9. బళ్లారి గోవర్ధన్ (ఆభరణాల వ్యాపారి)
10. ఎన్.విజయకుమార్ (మాజీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు)
11. కందరారు రాజీవరార్ (శబరిమల తంత్రి)
ఎప్పుడు ఏం జరిగిందంటే..
బంగారం తాడపం పనులు పూర్తయ్యాక బరువులో వ్యత్యాసం బయటపడడంతో ఈ కేసు మొదలైంది. 2019లో.. ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడం తొలగించి మళ్లీ తాపడం చేశారు. ఆ సమయంలో తిరిగి ఇచ్చిన బంగారం బరువులో వ్యత్యాసం బయటపడింది.
ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు మొదలైంది.

అయితే ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో కేరళ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఆ దర్యాప్తు వేగవంతం చేయాలని అక్టోబర్‌లో కేరళ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది కూడా.
బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి ప్రదాన సూత్రధారిగా సిట్ పేర్కొంది. అతనితో పాటు మాజీ అధికారిగా ఉన్న బి. మురారి బాబు అరెస్టు అయ్యారు. బెంగళూరులోని ఓ దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ కూడా చేశారు. ఆపై మరికొందరిని విచారించి.. అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ప్రధాన అర్చకుడి అరెస్టుతో కేసు మరో మలుపు తిరిగింది. అయితే.. మరిన్ని బంగారు తాపడం ప్లేట్లు తొలగించి బంగారం దోచుకోవాలని పెద్ద కుట్ర జరిగిందని కోర్టుకు సిట్ ఇప్పటికే నివేదించింది. శబరిమల బంగారం చోరీ కేసులో సిట్‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్(Prevention of Money Laundering Act) అభియోగాల కింద దర్యాప్తు జరుపుతోంది.


