
ఈసారి యుద్ధంలో మంచి ఫలితాలు సాధిస్తాం
పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు
ఇస్లామాబాద్: భారత్‌తో త్వరలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్తాన్ గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. మంగళవారం సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు నిజంగానే ఉన్నాయి. పరిస్థితిని ఉద్రిక్తం చేయటం నా ఉద్దేశం కాదు. కానీ ప్రమాదం ఉన్నమాట నిజం. నేను దానిని తోసిపుచ్చలేను. ఒకవేళ యుద్ధమే వస్తే.. దేవుడి దయవల్ల మనం గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తాం. గత ఆరు నెలల క్రితంకంటే ఇప్పుడు పాకిస్తాన్‌కు ఎక్కువమంది మద్దతుదారులు, మిత్రులు ఉన్నారు. గత మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ సమయంతో పోల్చితే భారత్ ఇప్పుడు మద్దతుదారులను కోల్పోయింది’అని పేర్కొన్నారు.
భారత్ ఒకేదేశం కాదు
మధ్యయుగంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఒకేదేశంగా లేదని ఖవాజా చెప్పుకొచ్చారు. కానీ, అల్లా దయతో ఏర్పడిన పాకిస్తాన్ ఒకే ఐక్య రాజ్యంగా ఉంటూ అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలి సైనిక ఘర్షణ సమయంలో ఐక్యంగా నిలబడిందని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను మానుకోవాలని ఇటీవల భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించిన విషయం తెలిసిందే.
భారత్ వాయుసేన అధిపతి కూడా గత శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా ఇచ్చిన ఎఫ్–16 సహా పాకిస్తాన్‌కు చెందిన 12 యుద్ధ విమానాలను కూల్చివేశామని తెలిపారు. అదేరోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ తన పౌరులను రక్షించుకునేందుకు ఏ దేశ సరిహద్దునైనా దాటి వెళ్లగలదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఖవాజా యుద్ధం వస్తుందని ఊహించినట్టు అంచనా వేస్తున్నారు.
ట్రంప్ అండతోనే..
ఆపరేషన్ సిందూర్ తర్వాత తాను బెదిరించటంవల్లే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు పదేపదే ప్రకటించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు లంచ్‌కు కూడా పిలిచాడు. ఆ తర్వాత కూడా పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. దీంతో మళ్లీ భారత్‌తో యుద్ధం జరిగితే ట్రంప్ తమకు సాయం చేస్తారని ఖవాజా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల సౌదీ అరేబియాతో పాక్ సైన్య సహకార ఒప్పందం చేసుకుంది. అందువల్లే యుద్ధం జరిగితే మంచి ఫలితాలు సాధిస్తామని ఖవాజా ప్రగల్భాలు పలికారని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు.