కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రతిపాదన
న్యూఢిల్లీ: బాలలను లైంగిక వేధింపుల బారినుంచి కాపాడేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టం విచ్చలవిడిగా దురి్వనియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. నిజమైన టీనేజీ ప్రేమ బంధాలను దీని బారినుంచి కాపాడేందుకు చట్టానికి రోమియో–జూలియట్ క్లాజ్‌ను జోడించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు, పోక్సో కేసుల్లో బెయిల్ దశలోనే బాధితుల వైద్యపరమైన వయసు నిర్ధారణకు హైకోర్టులు ఆదేశించజాలవని కూడా ధర్మాసనం స్పష్టం చేయడం విశేషం.
‘‘మా తీర్పు తాలూకు కాపీని కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి పంపండి. నిజమైన టీనేజీ ప్రేమలకు రక్షణగా నిలిచేలా పోక్సో చట్టానికి రోమియో–జూలియట్ క్లాజ్‌ను చేర్చడమే గాక ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రతీకారాలు తీర్చుకోజూసే వారిని శిక్షించే ఏర్పాటు కూడా చేయాల్సిందిగా సూచించండి’’అని సుప్రీంకోర్టు రిజి్రస్టార్‌ను ఆదేశించింది. ఓ మైనర్ రేప్ కేసులో నిందితునికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.


