మత ఛాందసవాదులతో కుమ్మక్కు
బంగ్లా హిందువులకు గడ్డు రోజులు
జమాత్ అధికారంలోకి వస్తే మైనారిటీలకు ముప్పు
రచయిత్రి తస్లీమా నస్రిన్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు, నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్‌పై ప్రవాస రచయిత్రి తస్లీమా నస్రిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం మత ఛాందసవాదులతో చేతులు కలిపిందని ఆరోపించారు. ఆ దేశంలో విభజన శక్తులకు అధికారాన్ని కట్టబెడుతోందని ఆమె మండిపడ్డారు. కేరళ శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తకోత్సవంలో ‘శాంతి కోసం పుస్తకం’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
నోబెల్.. శాంతికి కొలమానం కాదు
‘నోబెల్ శాంతి బహుమతి అనేది శాంతికి కొలమానం కాదు.. అధికారం మాత్రమే దాన్ని నిర్ణయిస్తుంది’.. అని తస్లీమా వ్యాఖ్యానించారు. గతంలో హెన్రీ కిసింజర్, ఆంగ్ సాన్ సూకీ వంటి వారు నోబెల్ పొందినా, వారి హయాంలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. సూకీ మానవత్వం కంటే అధికారానికే ప్రాధాన్యమిచ్చి రోహింగ్యాల ఊచకోతను అడ్డుకోలేకపోయారని విమర్శించారు.
బంగ్లా మైనారిటీల దుస్థితిపై ఆవేదన
బంగ్లాదేశ్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ముస్లిం మత ఛాందసవాదులు మైనారిటీలపై (ముఖ్యంగా హిందువులపై) దాడులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులర్ విద్యాసంస్థలు, సైన్స్ అకాడమీలను నిర్మించాల్సింది పోయి, కేవలం ఓట్ల రాజకీయం కోసం గత ప్రభుత్వాలు మసీదులు, మదరసాలను భారీగా నిర్మించాయని విమర్శించారు. ఇవే జిహాదీలను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఆమె దుయ్యబట్టారు.
రక్షణ లేని హిందూ మహిళలు
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలకు కనీస చట్టపరమైన రక్షణ లేదని, బహుభార్యాత్వం, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో వివక్ష కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. దీని కోసం ఉమ్మడి పౌర స్మృతి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌ను నిషేధించి, జమాత్–ఏ–ఇస్లామీ వంటి శక్తులు పుంజుకోవడం ఆందోళనకరమన్నారు. జమాత్ అధికారంలోకి వస్తే ‘షరియా చట్టం’అమలవుతుందని, అప్పుడు మహిళలు, మైనారిటీల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తస్లీమా హెచ్చరించారు.
భారత లౌకికత్వం భేష్
భారతదేశంలో మైనారిటీల పరిస్థితి బంగ్లాదేశ్‌పై ప్రభావం చూపుతోందా?.. అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘భారత్‌కు దీంతో సంబంధం లేదు. 1947 నుండి బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారత్ ఇప్పటికీ లౌకిక దేశంగానే ఉంది, కానీ బంగ్లాదేశ్ 1980లలోనే ఇస్లాంను అధికారిక మతంగా మార్చుకుని లౌకికత్వాన్ని కోల్పోయింది’.. అని ఆమె స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో మతాతీత రాజకీయాలు మళ్లీ రావాలంటే.. రాబోయే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, లౌకికవాద పారీ్టలే అధికారంలోకి రావాలని తస్లీమా నస్రిన్ ఆకాంక్షించారు.


