ట్రంప్ కోసమే వీధుల్లోకి వస్తున్నారు
జనంపై ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఆగ్రహం
యువరాజు రెజా పహ్లావీ పిలుపుతో ఉద్రిక్తతలు తీవ్రరూపం
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ ఫోన్‌కాల్ సేవలు బంద్
దుబాయ్: ఇరాన్‌లో ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో జనం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం నేత అలీ ఖమేనీ(86) గద్దె దిగాలంటూ పది రోజులుగా నిరసనలు కొనసాగుతుండటం తెల్సిందే. సుప్రీం నేత అలీ ఖమేనీ శుక్రవారం తన నివాసం వెలుపల చేరిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన శాంతియుతంగా నిరసనలు దిగిన ప్రజలపై హింసాత్మక చర్యలకు దిగితే వారికి మద్దతుగా నిలబడతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బెదిరింపుపై మండిపడ్డారు. ఇరానియన్ల రక్తంతో చేతులు తడుపుకున్నారంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసమే కొందరు వీధుల్లోకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించడానికి బదులుగా ట్రంప్ తన దేశం గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు.
ఇరాన్ యువరాజు పిలుపు
గురు, శుక్రవారాల్లో వీధుల్లోకి వచ్చి ఖమేనీ పాలనపై నిరసన వ్యక్తం చేయాలని ఇరాన్ మాజీ రాజకుటుంబ వారసుడు, చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రజలకు పిలుపు ఇచ్చారు. దీంతో, రాజధాని టెహ్రాన్ వాసులు గురువారం రాత్రి పనికిరాని వస్తువులతో వీధుల్లో మంటలు వేశారు. ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రెజా పహ్లావి తిరిగి రావాలని డిమాండ్ చేశారు.
జనం పెద్ద సంఖ్యల్లో వీధుల్లోకి తరలివచ్చి ర్యాలీలు చేపట్టిన వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో ప్రభుత్వం ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ ఫోన్‌కాల్స్‌పై నిషేధం విధించింది. దీంతో, ఆందోళనల తీవ్రత బయటి ప్రపంచానికి తెలియడం లేదు. అయితే, ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో కనీసం 62 మంది చనిపోయారని, మరో 2,500 మందిని అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.


