ఆయుధాల నీడలో శాంతి భ్రమ దౌత్యం కాదది.. దౌర్జన్యం
పెద్దన్నల పెత్తనంపై పోప్ నిప్పులు
వాటికన్ సిటీ: ప్రపంచ దేశాల విదేశాంగ విధానంపై పోప్ లియో–14 సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వ¿ౌమ దేశాలపై బలప్రయోగం చేస్తూ.. తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకునే దేశాల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ చట్టాలను, ప్రపంచ శాంతిని కొన్ని దేశాలు ‘పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయని’ఆయన ధ్వజమెత్తారు.
యుద్ధం ‘ఫ్యాషన్’అయిపోయింది..
‘ప్రస్తుతం యుద్ధం చేయడం మళ్లీ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. దేశాల మధ్య యుద్ధ కాంక్ష విపరీతంగా పెరుగుతోంది’.. అని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ దేశాల రాయబారులతో జరిగిన వార్షిక సమావేశంలో ఆయన ఈ ప్రసంగం చేశారు. వెనిజువెలాలో నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా జరిపిన సైనిక చర్య, ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో పోప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బలప్రయోగ దౌత్యంపై ఆందోళన
చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే సంప్రదాయ దౌత్యం పోయి, ఇప్పుడు బలప్రయోగం లేదా మిత్రదేశాల కూటములతో బెదిరించే ‘బల ప్రయోగ దౌత్యం’రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. ఆయుధాల ద్వారా శాంతిని స్థాపించాలనుకోవడం భ్రమ అని, ఇది కేవలం సొంత ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేసే ప్రయత్నమేనని పోప్ స్పష్టం చేశారు. ఇది ప్రపంచ శాంతికి పునాది అయిన చట్టబద్ధమైన పాలనను తీవ్రంగా దెబ్బ తీస్తుందని హెచ్చరించారు.
శాంతియుత పరిష్కారం కనుగొనాలి
వెనిజువెలాలో.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాంతియుత రాజకీయ పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, శాశ్వత పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం వెనకడుగు వేయకూడదని కోరారు. ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి ‘ద్వి–దేశ పరిష్కారం’ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు.
పాలస్తీనియన్లకు తమ సొంత గడ్డపై జీవించే హక్కు ఉందని నొక్కి చెప్పారు. కేవలం విదేశాంగ విధానమే కాకుండా గర్భస్రావం, సరోగసీకి వ్యతిరేకంగా క్యాథలిక్ చర్చి వాణిని వినిపిస్తూనే.. ఐక్యరాజ్యసమితి వంటి బహుళపక్ష వేదికలు బలహీనపడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా వాటికన్ దౌత్యపరమైన ప్రసంగాలు ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ భాషల్లో సాగుతాయి. అయితే, ఈసారి పోప్ లియో తన ప్రసంగంలోని అధిక భాగాన్ని ఆంగ్లంలో కొనసాగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.


