బెత్లెహాంలో భారీస్థాయిలో జరిగిన వేడుక
పదవి చేపట్టాక తొలిసారిగా క్రిస్మస్ సంబరాలు నిర్వహించిన పోప్ లియో–14
బెత్లెహాం: కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. విశ్వవ్యాప్తంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్ పర్వదిన సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గాజాలో హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రెండేళ్లుగా బెత్లెహాంలో కళ తప్పిన క్రిస్మస్ వేడుకలు మళ్లీ ఈ ఏడాది ఆనాటి అద్భుతపాత శోభను సంతరించుకున్నాయి.
దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో క్రైస్తవులు బెత్లెహాంలోని ప్రఖ్యాత మ్యాంగర్ కూడలికి చేరుకుని వేడుకను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. పోప్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నూతన పోప్ లియో–14 వాటికన్ సిటీలోని ప్రఖ్యాత సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో బుధవారం అర్ధరాత్రి మాస్ ప్రత్యేక వేడుకను నిర్వహించారు. మానవాళిని రక్షించేందుకు బాలయేసు జన్మించిన వృత్తాంతాన్ని చర్చికి వచి్చన విశ్వాసకులకు పోప్ వివరించారు.
జీసస్ జని్మంచిన బెత్లెహాంలో మ్యాంగర్ స్క్వేర్‌లో విద్యుత్‌దీపాలంకరణతో ఏర్పాటుచేసిన అతిపెద్ద క్రిస్మస్ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు జెరూసలేం నుంచి బెత్లెహాంకు క్యాథలిక్ మతగురువు కార్డినల్ పెయిర్‌బటిస్తా పిజాబల్లా వందలాది మంది క్రైస్తవులతో ఊరేగింపుగా వచ్చి బెత్లెహాంలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఐస్‌స్కేటింగ్ చేస్తూ కొందరు ఆనందంగా పండగ సంబరాల్లో మునిగితేలితే మరికొందరేమో ఉత్తర ఐర్లాండ్‌లోని గడ్డకట్టించే అతిశీతల సముద్రజలాల్లో ఈతకొడుతూ ఆనందంగా గడిపారు. ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో, ఆ్రస్టేలియా నగరాల్లో.. ఇలా పలు దేశాలు, నగరాల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. శాంటాక్లాజ్ వేషంలో పలువురు.. నిరాశ్రయులు, పేదలకు నిత్యావసర సరకులు, కానుకలు బహూకరించారు. క్యాన్సర్ వంటి మహమ్మారుల బారిన పడిన రోగుల కోసం ఫ్లోరిడా సర్ఫ్ మ్యూజియం సహా పలు లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు క్రిస్మస్ వేళ విరాళాలు సేకరించాయి.


