కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ క్రిస్మస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును ప్రస్తావించకుండానే ‘అతను అంతమవ్వాలి’ అని పరోక్షంగా చావు కోరుతూ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు మరింత వేడి జోడించినట్లుగా భావిస్తున్నారు.
మంగళవారం ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా విధ్వంసకర మిసైల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ క్రిస్మస్ పర్వదినాన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఉక్రెయిన్ పురాణాన్ని ప్రస్తావిస్తూ ‘పురాతన కాలం నుండి, ఉక్రేనియన్లు క్రిస్మస్ రాత్రి స్వర్గం తెరుచుకుంటుందని నమ్ముతారు. మీరు మీ కలను వారికి చెబితే, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజు, మనమందరం ఒకే కలను పంచుకుంటాము. అదే అతను అంతమవ్వాలి’ అని వ్యాఖ్యానించారు.
క్రిస్మస్ రోజున రష్యా 131 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. అప్రమత్తమైన ఉక్రెయిన్ సైన్యం వాటిని నిర్వీర్యం చేసినప్పటికీ, ఒక ప్రాంతంలో మొహరించిన 22 డ్రోన్లలో 15 డ్రోన్లు ప్రతికూల ప్రభావం చూపినట్లు ఏబీసీ న్యూస్ నివేదించింది. పండుగ సమయంలో రష్యా ఈ దాడులకు పాల్పడిందని జెలెన్‌స్కీ తీవ్రంగా విమర్శించారు.
జెలెన్‌స్కీ మాట్లాడుతూ..‘క్రిస్మస్ సందర్భంగా, రష్యన్లు మరోసారి తాము నిజంగా ఎవరో చూపించారు. భారీ షెల్లింగ్, వందలాది ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, కింజాల్ దాడులు జరిపారు’ అని మండిపడ్డారు. ఆయన రష్యా శాంతి ప్రయత్నాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ, పండుగ సమయంలోనే ఇలాంటి దాడులు జరపడం వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతోందని అన్నారు.
Merry Christmas! pic.twitter.com/okj9Yr1bFe
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 24, 2025


