అబుదాబి వేదికగా రష్యా, ఉక్రెయిన్, అమెరికా చర్చలు ప్రారంభం
నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడింది. యూఏఈ రాజధాని అబుదాబిలో ఉక్రెయిన్, రష్యా, అమెరికా ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. అమెరికా మధ్యవర్తిత్వంలో ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు నేరుగా ఒకే వేదికపై చర్చలు జరపడం ఇదే మొదటిసారి.
దీంతో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధాన్ని వెంటనే ముగించాలని పట్టుబడుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రత్యేక రాయబారులను ఈ చర్చలకు పంపారు. ఈ భేటీలో యుద్ధ విరమణ, భూభాగాల వివాదాల గురుంచి చర్చించారు. శనివారం(జనవరి 24) కూడా ఈ చర్చలు జరగనున్నాయి.
కాగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. శాంతి ఒప్పందం "దాదాపు సిద్ధమైందని" ప్రకటించారు. అయితే భూభాగాల మార్పిడి విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందని ఆయన తెలిపారు. రష్యా ఆక్రమించిన ప్రాంతాల విషయంలో ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది.


