ఉక్రెయిన్, రష్యా, అమెరికా
చర్చలు నేటి నుంచి మొదలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భేటీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటన
దావోస్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు వేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో గురువారం జెలెన్‌స్కీ ప్రసంగించారు. ‘‘యుద్ధం ముగింపే లక్ష్యంగా శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉక్రెయిన్, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి.
అంతకుముందు గురువారమే అమెరికా ప్రతినిధి బృందంతో మేం మంతనాలు జరుపుతాం. మా చర్చల పురోగతిని రష్యాకు వివరించేందుకు మరో అమెరికా బృందం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఆ తర్వాత రష్యా బృందంతో కలిసి అమెరికా, ఉక్రెయిన్ బృందాలు యునైటెడ్ అరబ్ ఎమిర్సేట్‌లో త్రైపాక్షిక చర్చలు జరుపుతాయి. యుద్ధం పరిసమాప్తి కోసం ఉక్రెయిన్ మాత్రమేకాదు రష్యా సైతం కొన్నిసార్లు త్యాగాలుచేయాల్సి ఉంటుంది.
అందుకు రష్యా సిద్ధపడాలి. చర్చలనేవే లేకుండా ఉండటం కంటే ఏదోరకమైన చర్చలకు ప్రయత్నించడం మంచిదే కదా. యుద్ధం ముగిసిపోయేలా మాకు దేవుడి దీవెనలు ఉంటాయని ఆశిస్తున్నా’’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ‘‘ గత ఏడాది ఇదే వేదికపై ఐరోపా సాయం కోసం వేడుకున్నా. ఆనాడు ఏం మాట్లాడానో అవే మాట్లాడాల్సి వస్తోంది. అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ‘గ్రౌండ్‌హాగ్ డే’ సినిమాలో పాత్రలాగా ఒకే రోజు మళ్లీ మళ్లీ పునరావృతమవుతోంది’’ అని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తంచేశారు.
ట్రంప్‌తో జెలెన్‌స్కీ కీలక చర్చలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తర్వాత జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు. ‘‘ ట్రంప్‌తో భేటీ ఉక్రెయిన్‌కు లబ్ధి చేకూరేలా సాగింది. మేమిద్దరం నేడో, రేపో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవుతాం. ఆ తర్వాతే త్రైపాక్షిక భేటీ జరగనుంది’’ అని అన్నారు. ట్రంప్, జెలెన్‌స్కీ భేటీ వివరాలను పుతిన్‌కు వివరించేందుకు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ మాస్కోకు వెళ్లనున్నారు.
పుతిన్‌తో అమెరికా బృందం భేటీని ట్రంప్ సైతం ్ర«ధువీకరించారు. ఎలాగైనాసరే ఈసారి చర్చలు విజయవంతంచేసి యుద్ధాన్ని ఆపేస్తామని ట్రంప్ ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు దావోస్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన ట్రంప్‌కు ప్రతికూల వాతావరణం సమస్యగా మారింది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ట్రంప్ హెలికాప్టర్ ఎగరలేకపోయింది. దాంతో రోడ్డు మార్గంలో ట్రంప్ జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో అమెరికాకు తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది.


