గ్రీన్‌లాండ్ వ్యవహారంపై పుతిన్ వ్యాఖ్య
మాస్కో: గ్రీన్‌లాండ్‌ను తమ స్వాధీనం చేయా లంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న డిమాండ్‌తో నాటో ఐక్యతకు బీటలు వారుతున్న వేళ ఈ వ్యవహారంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన శైలిలో స్పందించారు. గ్రీన్‌లాండ్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు. బుధవారం రాత్రి మాస్కోలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
‘గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఒక కాలనీ మాదిరిగా పరిగణిస్తోంది. అక్కడి ప్రజల విషయంలో క్రూరంగా కాకున్నా, కఠినంగా వ్యవహరించిందన్నది నిజం. అది వేరే విషయం. గ్రీన్‌లాండ్‌పై ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి ఉంటుందా అంటే అనుమానమే’అని పేర్కొన్నారు. ‘గ్రీన్‌లాండ్‌కు సంబంధించిన పరిణామాలపై మాకెలాంటి ఆందోళన లేదు. ఈ అంశాన్ని వాళ్లే పరిష్కరించుకుంటారని భావిస్తున్నా’అని పుతిన్ తెలిపారు. ‘1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు అమ్మేసింది. ఆ మాట కొస్తే రష్యా 1867లో అలా స్కాను అమెరికాకు 72 లక్షల డాలర్లకు విక్రయించింది’అని ఆయన చరిత్రను గుర్తు చేశారు.


