కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అక్కడికి హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి విచ్చేసిన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదినం, ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏటా క్రిస్మస్ పర్వదినం రోజున నా సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుగణం, స్నేహితులతో కలిసి పండుగలో పాల్గొనడం మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

అనంతరం వైఎస్ జగన్ తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్ రెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, చర్చి ఫాదర్లు రెవరెండ్ డాక్టర్ థామస్ ప్రసాదరావుబాబు, నరేష్ బాబు, మృత్యుంజయరావులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 2026 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చర్చిలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, డాక్టర్ సుధ, మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ మేయర్ సురేష్, కడప మేయర్ పాకా సురేష్, మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి పాల్గొన్నారు.


