తవ్వేకొద్దీ.. అవినీతి
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా కడప జీజీహెచ్‌తోపాటు ప్రొద్దుటూరు కేంద్రంగా జిల్లా ఆసుపత్రి, నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో దివ్యాంగుల రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతోంది. రీ వెరిఫికేషన్ తర్వాత మరలా దివ్యాంగుల విజ్ఞప్తితో రీ–రీ వెరిఫికేషన్ పెట్టారు. రిమ్స్‌లో దివ్యాంగుల సర్టిఫికెట్లలో ప్రధానంగా అర్హులైన వారిలో కొందరికి అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. కొందరు అంతంత మాత్రం అర్హులు, పూర్తి స్థాయిలో అనర్హులకు మాత్రం కొందరు దళారుల పుణ్యమా అంటూ పింఛన్ దక్కినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది దివ్యాంగుల సర్టిఫికెట్లను డబ్బులు వసూలు చేసుకుంటూ జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని విభాగాలలో ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్ తదితర విభాగాలతోపాటు, మరికొన్ని విభాగాలలో కూడా దళారులు వెంపర్లాడి సర్టిఫికెట్లను చేయించుకోవడంలో తమ వంతుగా కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్న కొందరు దళారులే మళ్లీ రంగ ప్రవేశం చేశారు. గతంలో ఒక్కో రీవెరిఫికేషన్ సర్టిఫికెట్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారని, తర్వాత రీ–రీ వెరిఫికేషన్ సమయానికి తమకు న్యాయం జరగలేదని కొందరు దివ్యాంగులు దళారులే తమకు ముక్తి ప్రసాదిస్తారని వారిని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలు, మండలాలలో దాదాపు 150 నుంచి 180 మంది దళారులుగా మారి గతంలో దివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు అక్రమార్జన చేసినట్లుగా రుజువులు కూడా బయటపడ్డాయి.
ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు
వైఎస్సార్ జిల్లా కడప కేంద్రంగా ఉన్న జీజీహెచ్‌లో ఓపీ విభాగంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు దివ్యాంగుల సర్టిఫికెట్ల కోసం దళారుల ద్వారా లక్షలాది రూపాయలను అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ లక్షలు కాస్త కోట్ల రూపాయల అక్రమార్జనకు దారి తీసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు
పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. రిమ్స్ అధికారులు కొందరు ఉద్యోగులపై ఇటీవల చర్యలకు సిద్ధమయ్యారు. ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. వీరిలో ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అనే ముగ్గురిపై ప్రాథమికంగా వారి తప్పులు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. పై ముగ్గురు తమ ఫోన్ పేలలో దివ్యాంగుల సర్టిఫికెట్లకు సంబంధించి పలువురి దళారుల దగ్గర నుంచి డబ్బులు వేయించుకున్నట్లు సమాచారం తెలిసింది. వీరిలో ఒక ఉద్యోగి అకౌంట్‌లో ఏకంగా కోటి 86 లక్షలు, ఒక ఉద్యోగి అకౌంట్‌లో కోటి రూపాయలకు పైగా డబ్బులు దళారుల నుంచి లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తోంది. మరో ఉద్యోగి ఖాతాలో కూడా డబ్బులు విరివిగా దళారులు వేసినట్లుగా సమాచారం. ఇంకా కొందరు చిరుద్యోగులు ఇందులో దళారులుగా వ్యవహరించి దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో తమ వంతుగా అక్రమార్జనకు పాల్పడినట్లు సమాచారం. దివ్యాంగుల సర్టిఫికెట్లలో అవినీతి, అక్రమార్జన అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఒకవైపు అధికారులు తమ వంతుగా చర్యలు చేపడుతున్నా.. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులు మాత్రం కొందరు కీలక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా చర్యలు ఉండేందుకు అన్ని విధాలుగా వారు గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు అనుకూలమైన దళారుల ద్వారా ‘పైసా వసూల్’ చేస్తూనే వున్నారని తెలుస్తోంది.
ముగ్గురిపై విచారణకు ఏసీబీకి సిఫారసు
దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో ముగ్గురు అవినీతి ఉద్యోగుల పట్ల విచారణ కోసం అధికారులు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ముగ్గురు అవినీతి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాల సేకరణ సమగ్రంగా జరిపించేందుకు అవినీతి నిరోధక శాఖకు రిమ్స్ పరిపాలన అధికారులు ఇప్పటికే సిఫారసు చేశారు. విచారణకు సంబంధించి రిమ్స్ అడ్మినిస్ట్రేటర్ రంగస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో అవినీతి ఉద్యోగులపై చర్యలకు అవినీతి నిరోధక శాఖ విభాగానికి సిఫారసు చేశామని తెలియజేశారు.
తాజాగా ఏసీబీ దాడులతో హడల్
కడప జీజీహెచ్‌లో బుధవారం మధ్యాహ్నం సదరం సర్టిఫికెట్ కోసం వీరపునాయునిపల్లెకు చెందిన వీరపుశేఖర్ తన భార్య చెవుడుకు సంబంధించిన సర్టిఫికెట్ కోసం ఆ విభాగానికి సంబంధం లేని ఆఫీస్ సూపరింటెండెంట్ మేదర సుబ్బయ్యకు రూ.30 వేలు లంచంగా ఇచ్చాడు. అతను ఆ డబ్బులను తీసుకుని వెళ్లి సదరం కార్యాలయంలో ఇన్‌చార్జిగా వున్న మాదా వెంకటేశ్వర్లుకు రూ.25 వేలు ఇచ్చి, తాను మిగిలిన రూ.5 వేలను తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ డిఎస్పీ సీతారామారావు, సీఐ నాగరాజు, సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటనతో రిమ్స్ పరిపాలన విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీబీ అధికారులు ఓపీ పరిపాలనా విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందితో స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులు కేవలం చిన్నపాటి చేపలతో సమానం అని, ఇంకా అవినీతి తిమింగలాలు కొన్ని పట్టుబడితేనే బాధితులకు, నిజమైన దివ్యాంగులకు సరైన న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.
దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో
అక్రమాలు
ప్రధాన విభాగాల్లో దళారులదే హవా
కలెక్టర్ ఆదేశాలతో విచారణ
ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
తాజాగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డ జీజీహెచ్ యంత్రాంగం
దివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో తవ్వేకొద్దీ.. అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన
అధికారులు.. కడప జీజీహెచ్‌లో ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురిని సస్పెన్షన్ చేశారు. సమగ్ర దర్యాప్తునకు ఏసీబీకి సిఫారసు చేశారు. తాజాగా ఏసీబీ దాడులు నిర్వహించడంతో.. రిమ్స్ యంత్రాంగం ఉలిక్కిపడింది. అయితే ఇప్పటి వరకు దొరికింది చేపలేనని, తిమింగళాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.


