సైన్స్ ప్రయోగాల పోటీలకు ఎంట్రీల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 8,9,10 తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి ‘యురేకా సైన్స్ ఎక్స్‌పో’ సైన్స్ ప్రయోగాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జేేవీవీ ప్రధాన కార్యదర్శి ఎన్.శివరాం తెలిపారు. కడప నగరం ద్వారకా నగర్‌లోని జేవీవీ కార్యాలయంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ విస్త్తృత స్థాయి సమావేశం సమీర్ బాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గత కార్యక్రమాల సమీక్షతోపాటు భవిష్యత్ కర్తవ్యాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇన్నోవేషన్ – టెక్నాలజీ, పర్యావరణం – వ్యవసాయం, అపోహలు – శాసీ్త్రయ వివరణ అనే మూడు అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. తక్కువ ఖర్చుతో చేసిన ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక వీడియోలో గరిష్టంగా ముగ్గురు విద్యార్థులు పాల్గొనవచ్చని, నిడివి ఐదు నిమిషాలు మించకూడదని తెలిపారు. ఒక పాఠశాల నుంచి ఎన్ని టీమ్స్ అయినా పాల్గొనవచ్చని చెప్పారు. ప్రవేశ రుసుం రూ.50గా నిర్ణయించామని పేర్కొన్నారు. వీడియోలను గూగుల్ ఫామ్ లింక్ ద్వారా మార్చి 8లోపు పంపాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతి అంశంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇస్తామని చెప్పారు. జిల్లా ప్రథమ విజేతలు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేస్తారని చెప్పారు. మార్చి 28న ఫలితాలు ప్రకటిస్తారన్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్ అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజశేఖర రాహుల్, బాల బయన్న, సరస్వతి, జిల్లా నాయకులు రౌఫ్ బాష, ఖాసిం వలీ, సుబ్బయ్య, గురవయ్య, నగర కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, సమతా కన్వీనర్ రామసుబ్బమ్మ, డేవిడ్, రమణ, కుమారస్వామిరెడ్డి పాల్గొన్నారు.


