అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో చోరీ
రాజంపేట : చెయ్యేరు నది ఒడ్డున వెలసిన శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దొంగలు మొదట సోలార్ లైటింగ్ సిస్టమ్‌ను లాగేశారు. తలుపుల తాళాలు పగులగొట్టారు. ఆలయంలో ఉన్న హుండీ ఎత్తుకెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రధాన అర్చకులు శివయ్యస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ తలుపులు తెరిచి వుండటం చూసి, దొంగతనం జరిగిందని భావించారు. వెంటనే ఆలయ ధర్మకర్త నూకా చెంగల్‌రెడ్డి, మన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విచారణ చేశారు. హుండీ దగ్గరలో వేసి ఉంటారని పలువురు గాలించారు. అయినా దొరకలేదు.
సాఫ్ట్‌బాల్
నూతన కార్యవర్గం ఎన్నిక
రాజంపేట రూరల్ : వైఎస్సార్ కడప జిల్లా సాఫ్ట్‌బాల్ జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఆ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు రామకృష్ణ(సత్యసాయి జిల్లా), విజయ్(కర్నూలు జిల్లా), కామేశ్వరమ్మ (నెల్లూరు జిల్లా)లు ఈ ఎన్నికకు అబ్జర్వర్లుగా వ్యవహరించారు. చైర్మన్‌గా డి.సుధాకర్‌యాదవ్, అధ్యక్షుడిగా శ్రీకాంత్‌రెడ్డి, సెక్రటరీగా రామసుబ్బారెడ్డి, ట్రెజరర్‌గా శివకుమార్, జాయింట్ సెక్రటరీలుగా రామకృష్ణారెడ్డి, జగదీశ్వరయ్య, ఉపాధ్యక్షుడిగా శివశంకరరెడ్డి, ఈసీ మెంబర్‌లుగా జేసునాథ్‌రెడ్డి, పి.కల్యాణ్, బి.పద్మావతి, సీవీ రమణారెడ్డి, అరుణ కుమారీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శివాజీ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుబ్రమణ్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్, నాజీ వ్యాయామ ఉపాధ్యాయులు షామీర్‌బాషతో పాటు సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
దువ్వూరు : మండలంలోని ఐ.బయనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లె గ్రామానికి చెందిన వరికూటి బాబు(45) ప్రొద్దుటూరు నుంచి నంద్యాల జిల్లా చాగలమర్రికి ట్రాక్టర్‌లో ఇటుకులు తీసుకుని పోతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కడప – కర్నూలు జాతీయ రహదారిపై ఐ.బయనపల్లె మెట్ట వద్దకు రాగానే ట్రాక్టర్‌ను.. వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ట్రాక్టర్ అదుపు తప్పి రహదారిపై ఉన్న బ్రిడ్జిని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ వరికూటి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందడంతో భార్య, పిల్లలు, తల్లి కన్నీరు మున్నీరు అయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు.
శనగ పంట దగ్ధం
లింగాల : అగ్ని ప్రమాదంలో చేతికొచ్చిన 2 ఎకరాల శనగ పంట దగ్ధమైంది. ఈ సంఘటన లింగాల మండలం పరిధిలోని రామన్నూతలపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చామ గంగిరెడ్డి 4 ఎకరాలలో సాగు చేసిన శనగ పంట కోతకు వచ్చింది. అయితే ప్రమాదవశాత్తు ఆదివారం రెండు ఎకరాల పంట పూర్తిగా కాలిపోయి బూడిద అయింది. లక్ష రూపాయలకు పైగా నష్టం వచ్చిందని బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరారు.
చౌక బియ్యం పట్టివేత
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని పవర్ గ్రిడ్ చెక్‌పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న చౌక దుకాణం బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. కడప నుంచి రాయచోటికి అక్రమంగా తరలిస్తున్న 70 సంచుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని, రవాణా చేస్తున్న వాహనాన్ని, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అందుకు కారణమైన నలుగురిపైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో చోరీ
అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో చోరీ


