ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ స్టేట్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్‌రావు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఆర్‌ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఈయూ జోనల్ అధ్యక్షుడు కేకే కుమార్ అధ్యక్షతన 10వ జోనల్ నిర్మాణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు పేరుకుపోయి రూ.40 వేల కోట్ల వరకు చేరుకున్నాయన్నారు. రిటైర్డు అయిన ఉద్యోగులు, మృతి చెందిన కుటుంబాలకు చెల్లించాల్సిన సెటిల్‌మెంట్ డబ్బు వెంటనే చెల్లించి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పెన్షనర్లు, సేవలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, డీఏ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, సరెండర్ లీవు బకాయిలు దశల వారీగా చెల్లించడమే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సీ్త్ర శక్తి మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారన్నారు. ఓవర్ లోడ్ కారణంగా జరిగిన చిన్న పొరపాట్లకు తనిఖీ అధికారులు నమోదు చేసిన కేసులపై వాస్తవాలను పరిశీలించకుండా డిపో మేనేజర్లు సస్పెండ్, రిమూవ్, తీవ్రమైన పనిష్‌మెంట్లు విధించడం అన్యాయమన్నారు. ఈ విధానం మారకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి అవసరమైతే రాష్ట్ర స్థాయి ఆందోళనకు వెళతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం కారణంగా ప్రయాణికుల సంఖ్య పెరిగినందున 3 వేల కొత్త బస్సులను పెంచాలని, డ్రైవర్, కండెక్టర్, మెకానికల్ తదితర కేటగిరిల్లో ఉన్న సుమారు 8 వేల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని కోరారు.
సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి : ఈడీ
కడప జోన్‌లోని అన్ని కేటగిరిల ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌టీపీ రాఘవకుమార్ తెలిపారు. కడప జోన్‌లోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రాజు, జోనల్ కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర నాయకులు అర్జున్, నబీ రసూల్, ఈఆర్ కుమార్, మద్దిలేటి, పీఏ మజీద్, వెంకటేశ్వర్లు, నాగార్జునరెడ్డి, విజయ్‌కుమార్, మురళీధరన్, మురగమ్మతోపాటు జోనల్ కమిటీ సభ్యులు, 8 జిల్లాల నాయకులు, 51 డిపోల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి


