మద్యం బాకీ విషయమై పరస్పర దాడులు
బద్వేలు అర్బన్ : మద్యం బాకీ విషయమై ఆదివారం మద్యంషాపు యజమాని, కొనుగోలుదారుడు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో మద్యంషాపు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కొండారెడ్డివీధికి చెందిన విష్ణుమోహన్‌రెడ్డి పోరుమామిళ్ళ బైపాస్ రోడ్డులో కార్తీక్ వైన్స్ పేరుతో మద్యం షాపు నిర్వహిస్తున్నాడు. బి.కోడూరు మండలానికి చెందిన రామిరెడ్డి రోజూ కార్తీక్ వైన్స్‌లోనే మద్యం కొనుగోలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో రామిరెడ్డి కార్తీక్ వైన్స్‌లో మద్యం అప్పునకు తీసుకుని వెళ్లాడు. దీనిపై మద్యం దుకాణ నిర్వాహకుడు విష్ణుమోహన్‌రెడ్డి తన దుకాణంలో పని చేసే గుమస్తాతో బాకీ విషయమై రామిరెడ్డికి ఫోన్ చేయించాడు. దీంతో దుకాణం వద్దకు వెళ్లిన రామిరెడ్డికి, షాపు నిర్వాహకుడికి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రామిరెడ్డి తన గ్రామం నుంచి బంధువులను పిలిపించి ఆదివారం సాయంత్రం హెచ్‌పీ పెట్రోలు బంకు సమీపంలో ఉన్న విష్ణుమోహన్‌రెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో విష్ణుమోహన్‌రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటన స్థలానికి వచ్చేసరికి గొడవ సద్దుమణిగింది. గాయపడిన విష్ణుమోహన్‌రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష్ణుమోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామిరెడ్డితోపాటు మరో నలుగురిపై అర్బన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేశారు.
ఏమార్చి.. ఏటీఎం కార్డు మార్చి..
వేంపల్లె : స్థానిక పుల్లయ్య తోట నగర్‌కు చెందిన రిటైర్డ్ లెక్చరర్ అందలం రంగనాయకులు ఏటీఎం కార్డును గుర్తుతెలియని వ్యక్తులు మార్చి 30 వేలు అపహరించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగి రంగనాయకులు ఈ నెల రెండవ తేదీన తన పెన్షన్ డబ్బుల కోసం వేంపల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్దకు వెళ్లారు. పెన్షన్ డబ్బులు పడ్డాయా, లేదా అని తమ పక్కనే ఉన్న వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇచ్చి చూడమన్నారు. ఆ తర్వాత ఆ గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు పడలేదు అని తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డును మార్చి ఇచ్చారు. ఆ రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి వెళ్లిన గంట తర్వాత రూ.20 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. మరలా రూ.10 వేలు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లి చూడాలని కోరారు. మీకు వచ్చిన పెన్షన్ డబ్బులు గంట క్రితమే డ్రా చేశారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి అవాక్కయ్యారు. స్టేట్ బ్యాంక్ మేనేజర్ తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించగా.. ఇది మీది కాదని మీ ఏటీఎం కార్డు ఎవరో దొంగలించారని వివరించారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వృద్ధుడు తెలిపారు. ఏ విధంగానైనా పోయిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.
మద్యం షాపు యజమానికి తీవ్ర గాయాలు


