చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల నాయకులు
మాట్లాడుతున్న మాజీ మేయర్ కె.సురేష్‌బాబు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జనగణనలో సమగ్రంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మేయర్ కె.సురేష్ బాబు, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం బీసీలు క్రియాశీలక పోరాటాలకు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. కడప నగరంలోని బీసీ భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు, సమగ్ర కులగణన చేపట్టాలని కోరుతూ ఆదివారం జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టి, అందుకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించిందన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనగణనలో కులగణన చేపట్టి, కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలన్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలనేది దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వెనుకబడిన తరగతులు ఎల్లప్పుడూ వెనుకబడే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగణనలో కులగణన చేపడితే బీసీల సంఖ్య తేలుతుందని, బీసీలలో సమాంతరమైన అవకాశాలు కల్పించేందుకు ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులగణనలో సమగ్రంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి, మాజీ కార్పొరేటర్ హరినారాయణ, నాయకులు యానాదయ్య, సానే శ్రీనివాసులు, డాక్టర్ మల్లెల భాస్కర్, ప్రతాప్ యాదవ్, ఖాదర్ బాషా, వెంకటేశ్వర్లు, బసవరాజు, గోపాల్, సంగటి మనోహర్, వెంకటశివ తదితరులు పాల్గొన్నారు.
చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి


