సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్‌లో ఉండటం వల్ల ఎలాంటి లాభం లేదంటూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరు జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో తన అనుచరులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ వ్యాఖ్యానించారు.
మూడు సార్లు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది. పటాన్ చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటిల్లోని 104 కౌన్సిలర్లను గెలిపించేందుకు విభాగాల వారిగా పని చేద్దామని మహిపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే హాట్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


