గణపతి లొంగుబాటు? | Ganapathi Ready to surrender in the presence of Amit Shah | Sakshi
Sakshi News home page

గణపతి లొంగుబాటు?

Mar 5 2026 5:59 AM | Updated on Mar 5 2026 5:59 AM

Ganapathi Ready to surrender in the presence of Amit Shah

అమిత్‌ షా సమక్షంలో లొంగిపోయేందుకు రంగం సిద్ధం

ఇప్పటికే రాష్ట్ర పోలీసులతో టచ్‌లోకి వచ్చినట్టుగా సమాచారం 

సేఫ్‌ ప్యాసేజ్‌ కల్పించడంతో నేపాల్‌ నుంచి ఢిల్లీకి..! 

హైదరాబాద్‌లో దేవ్‌జీ లొంగిపోయినప్పుడే గణపతి ప్రస్తావన..  తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రితో సీఎం రేవంత్, డీజీపీ, ఎస్‌ఐబీ చీఫ్‌ భేటీ 

మావోయిస్టు అగ్రనేత లొంగుబాటుపైనా చర్చ!

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్‌ నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో లొంగిపోవడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన తిప్పిరి తిరుపతి, రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్‌ చంద్రన్న తదితరులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైన సందర్భంలోనే.. గణపతి గురించిన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కాగా త్వరలో జరగబోయే మావోయిస్టు రహిత భారత్‌ సదస్సుతో పాటు మావోయిస్టు నేతల లొంగుబాట్లపై చర్చించడానికి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతి బుధవారం ఢిల్లీలో అమిత్‌షాతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా గణపతి లొంగుబాటు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం సాయంత్రం నుంచే దేశ రాజధానిలో గణపతి లొంగుబాటు అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి.. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల నేపథ్యంలో గణపతి తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన త్వరలోనే లొంగిపోవడానికి మార్గం సుగమం అయిందని తెలుస్తోంది. 

వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్‌ కగార్‌ తరువాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిన గణపతి దేశం విడిచి నేపాల్‌ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ పోలీసులతో టచ్‌లోకి వచ్చారని.. ఉన్నతాధికారులు ఆయనకు సేఫ్‌ ప్యాసేజ్‌ కల్పించి నేపాల్‌ నుంచి ఢిల్లీకి వచ్చేలా చూశారని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది.  

అనారోగ్యంతోనే బాధ్యతల నుంచి పక్కకు.. 
మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న గణపతి అనారోగ్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. అయినా జనజీవన స్రవంతిలోకి రాకుండా ఉద్యమంలో కొనసాగారు. మూడు నాలుగు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్‌ను ఆ తర్వాత మావోయిస్టు పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సాయుధ పంథావైపు నడిపించడంలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో పోలీసులకు పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. ఏది ఏమైనా గణపతి లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం ముగింపునకు వచ్చినట్టేనని అంటున్నారు.  

సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా.. 
గణపతి 1949లో జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం బీర్పూర్‌లో జని్మంచారు. ఆయన్ను ఉద్యమంలో టీచర్‌ అని పిలుస్తారు. 1970లో జరిగిన రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర తర్వాత నక్సల్‌ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా గణపతికి గుర్తింపు లభించింది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆయన పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్‌వర్క్‌ విస్తరణలో గణపతిది కీలక పాత్రగా చెబుతారు. గణపతితో పాటు ఆయన సహచరిణి సుజాత కూడా ఇప్పటివరకు అజ్ఞాతంలోనే ఉన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement