కండక్టర్‌ డ్యూటీ.. కాదంటే కోరుకున్న జిల్లాకు బదిలీ | Over two thousand electric buses arrive in the city | Sakshi
Sakshi News home page

కండక్టర్‌ డ్యూటీ.. కాదంటే కోరుకున్న జిల్లాకు బదిలీ

Mar 5 2026 1:18 AM | Updated on Mar 5 2026 1:18 AM

Over two thousand electric buses arrive in the city

ఎక్సెస్‌ అయ్యే డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది విషయంలో తుది నిర్ణయం 

నగరంలో రెండువేలకుపైగా ఎలక్ట్రిక్‌ బస్సుల రాక 

సిటీ మొత్తంగా ఇవే బస్సులు నడపనున్న ఆర్టీసీ.. ప్రణాళిక ఖరారు చేసిన ఆర్టీసీ 

సాక్షి, హైదరాబాద్‌: పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద హైదరాబాద్‌ నగరానికి 2 వేలకుపైగా ఎలక్ట్రిక్‌ బస్సులు రానుండడంతో నగరంలో పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సర్దుబాటు చేసే విషయంలో సంస్థ ఓ ప్రణాళికను ఖరారు చేసుకుంది. ఆరునెలల తర్వాత నుంచి దశలవారీగా ఈ బస్సులు రానున్నాయి. ఈ రాక ప్రారంభమైన తర్వాత నగరం మొత్తం ఎలక్ట్రిక్‌ బస్సులే తిరగనున్నాయి. 

దీంతో ఇక్కడ పని చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి పని లేకుండా పోనుంది. అలాంటి వారు దాదాపు 8 వేల మంది వరకు ఉండనున్నారు. దీంతో వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న విషయంలో తాజాగా ఉన్నతస్థాయిలో సమీక్షించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తాజాగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి రాజేంద్రనగర్‌ డిపోను సందర్శించారు. 

ఆరాంఘర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని ఆర్టీసీకే అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరనున్నారు. దీంతో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లే క్రమంలో రాజేంద్రనగర్‌ డిపోకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న కార్మికులతో కాసేపు ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్‌ బస్సులు వచ్చిన తర్వాత ఏర్పడే పరిస్థితులు, అదనంగా మారే సిబ్బంది సర్దుబాటు గురించి వారికి క్లుప్తంగా వివరించారు. 

» ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా, 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు వచ్చిన తర్వాత ఏకంగా 4 వేల మంది డ్రైవర్లు అదనంగా మారనున్నారు. ప్రస్తుతం 2 వేల కండక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇటీవల 1,700 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఆ విధుల్లోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులు వచ్చే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. అప్పుడు మిగులుబాటులో ఉన్న డ్రైవర్లకు కండక్టర్‌ విధులు అప్పగిస్తారు.  

» కండక్టర్‌ పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా అదనంగా ఉండే డ్రైవర్ల నుంచి ఆప్షన్లు తీసుకుని వారి సొంత జిల్లాలు, వారు కోరిన ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు.  

» కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసిన తర్వాత కూడా మిగిలిపోయే డ్రైవర్లను, ఇతర జిల్లాలకు పంపుతారు.  

»  నగరంలో దాదాపు 4 వేల మంది వరకు గ్యారేజీ సిబ్బంది మిగిలిపోతారు. వీరిలో బస్సు నడిపే లైసెన్సులు ఉన్నవారిని గుర్తించి డ్రైవర్‌ డ్యూటీలు అప్పగించి వారు కోరుకున్న జిల్లాలకు బదిలీ చేస్తారు.  

» నగరంలోనే ఉండాలనుకునేవారికి కండక్టర్‌ డ్యూటీలు అప్పగిస్తారు.  

» కండక్టర్‌ పోస్టులు భర్తీ అయ్యాక మిగిలిపోయే వారిని వారు కోరుకునే జిల్లాల్లో కండక్టర్‌ బాధ్యతలు అప్పగిస్తారు. అప్పటికీ మిగిలిపోయే వారి ని ఇతర జిల్లాలకు బదిలీచేసి సర్దుబాటుచేస్తారు.  

» నగరం నుంచి వెళ్లేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉండదు. దీంతో వారి సీనియారిటీ నగరంలోనే కొనసాగేలా, ఇక్కడి వేతనమే పొందేలా ఏర్పాట్లు చేస్తారు.  

ఈ పరిస్థితికి ఇదీ కారణం... 
ఆర్టీసీలో ఉండే ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రైవేటు సంస్థలు అద్దె ప్రాతిపదికన(గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు) నడుస్తున్నవే. వాటిల్లో డ్రైవర్లు, మెకానిక్‌ సిబ్బంది ప్రైవేటు వారే ఉంటారు. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ సిబ్బంది ఉంటారు. నగరంలో అన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే తిరిగేలా చర్యలు తీసుకుంటున్నందున, ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డ్రైవ ర్లు, గ్యారేజీ సిబ్బందికి పని లేకుండా పోనుంది. వారినే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement