భూసేకరణకు రూ. 5 వేల కోట్లు | Release of funds for land acquisition requirements for irrigation projects in the state | Sakshi
Sakshi News home page

భూసేకరణకు రూ. 5 వేల కోట్లు

Mar 5 2026 12:49 AM | Updated on Mar 5 2026 12:49 AM

Release of funds for land acquisition requirements for irrigation projects in the state

జూలైనాటికి సింగూరుకు మరమ్మతులు పూర్తి చేస్తాం 

సమీక్షలో మంత్రి ఉత్తమ్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ అవసరాలకు రూ. 5 వేల కోట్ల విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జూన్‌ 2 నాటికి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు దామోదర, పొంగులేటి, సీతక్క, వివేక్‌తో కలిసి బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖపై సమీక్షించారు. సింగూరు ప్రాజెక్టు భద్రతను పటిష్టం చేసేందుకు చేపట్టిన మరమ్మతులను జూలై నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు. 

హైదరాబాద్‌ మహానగరానికి ప్రాణధారగా నిలిచిన సింగూరు ప్రాజెక్టు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. స్వయంగా ప్రాజెక్టును సందర్శించి సమగ్ర రీతిలో సమీక్షిస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నివేదికలు అందిన నేపథ్యంలో క్రమంగా నీటి నిల్వలను తగ్గించి తక్షణ మరమ్మతులు చేపట్టామన్నారు. మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును పటిష్టపరిచే వరకు పూర్తిస్థాయి మట్టం మేరకు నీటిని నిల్వ చేయరాదని నిర్ణయించామని చెప్పారు. 

ప్రాజెక్టులో సమస్యలను గుర్తించేందుకు అండర్‌ వాటర్‌ సర్వేలు, సోనార్‌ పరీక్షలు నిర్వహించి రెండు మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సిన అవసరం లేకుండా ఒకే పంట సీజన్‌లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. సింగూరు కాల్వల లైనింగ్‌ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 13 కి.మీ.ల కాల్వకు గాను 9 కి.మీ.ల లైనింగ్‌ పూర్తయిందని, మిగిలిన 4 కి.మీ.ల మేర కాల్వకు లైనింగ్‌ను జూన్‌ 26లోగా పూర్తి చేయాలన్నారు.

ఉగాది నాటికి పెద్దారెడ్డి ఎత్తిపోతలకు శంకుస్థాపన  
అందోల్‌ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన పెద్దారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను సత్వరంగా రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు ఉగాదిలోగా శంకుస్థాపన చేస్తామన్నారు. 

అందోల్‌ నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించాలన్నారు. ములుగు జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణను వేగిరం చేయాలని తెలిపారు. పాలెంవాగు గేట్లు, రెగ్యులేటర్లకు మరమ్మతులు చేయాలని చెప్పారు. పాలెంవాగుపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement