అందుకు పథకం సిద్ధం
ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ అంచనా
ట్రంప్‌ది మతిలేని దూకుడు
అమెరికా ఓ ధూర్త దేశమని వ్యాఖ్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ట్రంప్ అదుపు తప్పారు. ఆయనది మతిలేని దూకుడు’’ అంటూ విమర్శించారు. అమెరికా నిత్యం పాటిస్తానని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనంటూ దుయ్యబట్టారు.
వెనెజువెలా అనంతరం ట్రంప్ తదుపరి లక్ష్యం కచ్చితంగా ఇరాన్ అని తాజాగా ఇండియాటుడే వార్తాసంస్థతో మాట్లాడుతూ శాక్స్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ఫ్లోరిడాలోని మారా లాగో ఎస్టేట్‌లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. తదుపరి లక్ష్యం ఇరాన్ అని ఆ సందర్భంగా వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు’’ అని వెల్లడించారు. అమెరికాను ధూర్త దేశం (రోగ్ స్టేట్)గా శాచ్స్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ అంతకుమించిన ధూర్త దేశమంటూ ఆక్షేపించారు.
‘‘అవి రెండూ నిజంగా ఇరాన్‌పై భారీ ఎత్తున దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచ యుద్ధ స్థాయికి విస్తరిస్తుంది’’ అని హెచ్చరించారు. ఇరాన్ వద్ద పలు అత్యాధునిక క్షిపణులున్నాయని గుర్తు చేశారు. ‘‘ఇరాన్ మాత్రమే కాదు. మెక్సికో, కొలంబియా, క్యూబా, డెన్మార్క్, నైజీరియా ఇలా కనీసం మరో అర డజను దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాద పోకడలను భారత్ తదితర బ్రిక్స్ దేశాలే అడ్డుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. గ్రీన్‌లాండ్ ఎప్పటికీ డెన్మార్క్‌దేనని యూరప్ దేశాలన్నీ ముక్తకంఠంతో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
పిల్ల చేష్టల ట్రంప్
సైన్యం, ముఖ్యంగా సీఐఏ, పెంటగాన్ వంటి భద్రతా సంస్థలు, ఇంకా సామ్రాజ్యవాద కుబేరులతో కూడిన రాజ్యాంగేతర శక్తి అయిన డీప్‌స్టేట్ ప్రస్తుతం అమెరికాను పాలిస్తోందంటూ శాక్స్ ఆరోపించారు. ‘‘ఇక ట్రంప్ నిజానికి ఓ ఉన్మాది. ఎక్కడ చమురు కనిపించినా అది తమదేననే రకం. ఆయనవి పిల్ల చేష్టలు. వెనెజువెలాపై ఆయనకు ఎప్పట్నుంచో కన్నుంది. తొలి దఫా అధ్యక్షునిగా ఉండగా 2017లో లాటిన్ అమెరికాకు చెందిన పలువురు నేతలను విందుకు పిలిచారు. వెనెజువెలాపై తానెందుకు దాడి చేయకూడదని వారిని అడిగారు. అది ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందంటూ వారు వారించడంతో వెనక్కు తగ్గారు.
ఇప్పుడు మాత్రం మతిలేని దూకుడుతో మదురోను బంధించి తీసుకెళ్లారు. అయితే దీని వెనక డీప్‌స్టేట్ అజెండా సైతం దాగుంది. ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానాన్ని నియంత్రించేంది అధ్యక్షుడు కాదు, డీప్‌స్టేట్’’ అని శాక్స్ చెప్పుకొచ్చారు. ‘‘నిజానికి ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే వస్తోంది. కానీ పలు దేశాల్లో నాయకత్వాన్ని మార్చేందుకు ఇప్పటిదాకా అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. వెనెజువెలాలో అదే పునరావృతం అయ్యేలా కన్పిస్తోంది’’ అని అంచనా వేశారు.


