ట్రంప్ సుంకాలు రేపటి నుంచి బంద్ | US to Stop Collecting Trump Tariffs From Tomorrow After Supreme Court Ruling | Sakshi
Sakshi News home page

ట్రంప్ సుంకాలు రేపటి నుంచి బంద్

Feb 23 2026 4:42 PM | Updated on Feb 23 2026 5:11 PM

US to Stop Collecting Trump Tariffs From Tomorrow After Supreme Court Ruling

అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల (టారిఫ్స్)కు బ్రేక్ పడింది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. ఆ దేశ సుప్రీంకోర్టు సంచనల తీర్పునిచ్చింది. దీంతో టారిఫ్స్ వసూళ్లు రేపటి (మంగళవారం) నుంచి నిలిపివేస్తున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా వెల్లడించింది.

ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ (IEEPA) కింద విధించిన సుంకాలను, వసూలు చేయడాన్ని అమెరికా మంగళవారం ఉదయం 12:01 EST (0501 GMT) నుంచి నిలిపివేయనుంది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని US సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. దీంతో సంబంధిత కోడ్లు సాఫ్ట్‌వేర్‌ నుంచి డియాక్టివేట్ చేయనున్నారు.

అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎలాగైనా 15 శాతం సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారికంగా వెలువడలేదు. రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు సమాచారం. అయితే.. ఆదేశాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు, వాటిని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు
టారిఫ్‌లను విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వాణిజ్యం, పన్నులకు సంబంధించిన అంశాలపై పూర్తి అధికారం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకూ వసూలు చేసిన వందల బిలియన్‌ డాలర్ల సుంకాలను.. దిగుమతి దారులకు తిరిగి ఇవ్వాల్సి రావొచ్చని కూడా సుప్రీం తెలిపింది.

ట్రంప్ అసంతృప్తి
గ్లోబల్ టారిఫ్ విధానాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను తీవ్ర నిరాశ‌ప‌రిచింద‌ని ఆయ‌న అన్నారు. అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు విదేశీ శక్తుల ప్ర‌భావానికి లోన‌య్యార‌ని ట్రంప్ ఆరోపించారు.

ఇదీ చదవండి: 2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ!

Advertisement
 
Advertisement
Advertisement