స్నేహితుడికి సాయం చేద్దామని బ్యాంక్ ఖాతా వివరాలు పంచుకున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు ఖాతాల విషయంలో యువతకు పెద్ద హెచ్చరికగా మారింది. బ్యాంక్ ఖాతా వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది
బెంగళూరులోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహం ఉంది. 2025 నవంబర్‌లో ఆయుష్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, తాత్కాలికంగా విద్యార్థి ఖాతాను ఉపయోగించుకుంటానని అభ్యర్థించాడు.
స్నేహితుడిని పూర్తిగా నమ్మిన విద్యార్థి.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) ఖాతాకు లింక్ అయిన ఏటీఎం కార్డ్‌తో పాటు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో సహా అన్ని యాక్సెస్ వివరాలను పంచుకున్నాడు. ఈ వివరాలను పోస్ట్ ద్వారా పంపగా.. అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్‌లో ధ్రువీకరించాడు కూడా.
అయితే, కొన్ని నెలల తర్వాత షాకింగ్ నిజం బయటపడింది! బ్యాంకు అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి.. అతడి ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపింది. దాదాపు రూ.7 కోట్లు ఈ ఖాతా ద్వారా బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లోనే ఈ మొత్తం లాండరింగ్ జరిగినట్లు సమాచారం.
తన ఖాతా సైబర్ నేరస్థుల 'మ్యూల్ అకౌంట్'గా దుర్వినియోగం అయినట్లు తెలిసిన విద్యార్థి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆయుష్‌తో పాటు ఇతరులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఓ హెచ్చరికే!
స్నేహితులు అయినా.. బ్యాంక్ డీటెయిల్స్, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుంచే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ లేదా పోలీసులు అడిగినా.. ఫోన్‌లో ఇలాంటి వివరాలు ఇవ్వవద్దు. జాగ్రత్తలు తీసుకోండి.. సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండండి!
బ్యాంక్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, ఖాతా వివరాలు స్నేహితులు/బంధువులు అయినా ఎవరికీ ఇవ్వవద్దు. బ్యాంకులు కూడా ఎప్పుడూ ఇలాంటివి ఫోన్ ద్వారా అడగవు.
- "తాత్కాలికంగా ఖాతా ఉపయోగించుకోవాలి", "ఈజీ మనీ", "కమిషన్ ఇస్తాం", "జాబ్ ఫ్రమ్ హోమ్" అని ఎవరైనా అడిగితే నిరాకరించండి. ఇవి మనీ మ్యూల్ స్కామ్‌లే!
- స్ట్రాంగ్ పాస్‌వర్డ్ (అప్పర్+లోయర్+నంబర్+స్పెషల్) పెట్టుకోండి. దీన్ని రెగ్యులర్‌గా మారుస్తూ ఉండండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (SMS/ఈమెయిల్) ఆన్ చేసుకోండి. దీని వల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే తెలుస్తాయి.
- అన్‌నోన్ SMS/వాట్సాప్ లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకు యాప్/వెబ్‌సైట్ నేరుగా టైప్ చేసి వెళ్లండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు.
- ఖాతా స్టేట్‌మెంట్ తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు, 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.


