సొంత దేశంపై బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ తిరుగుబాటు | Tamim Iqbal revolts against Bangladesh; asks BCB not to mess with India on Pakistan backing | Sakshi
Sakshi News home page

సొంత దేశంపై బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ తిరుగుబాటు

Jan 9 2026 12:38 PM | Updated on Jan 9 2026 1:10 PM

Tamim Iqbal revolts against Bangladesh; asks BCB not to mess with India on Pakistan backing

భారత్‌-బంగ్లాదేశ్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్‌పై ఆ దేశ క్రికెటరే తిరుగుబాటు చేసినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ అయిన తమీమ్‌ ఇక్బాల్‌ భారత్‌తో అనుసరిస్తున్న విధానాలపై సొంత దేశ నాయకులను, క్రికెట్‌ బోర్డును హెచ్చరించినట్లు సమాచారం. 

పాక్‌ అండ చూసుకొని భారత్‌పై రెచ్చిపోవద్దని తమీమ్‌ స్వదేశీ క్రికెట్‌ బోర్డుకు సూచించినట్లు తెలుస్తుంది. అలాగే ఐసీసీతో విరోధం​ కూడా మంచి కాదని హెచ్చరించినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం​ తమీమ్‌ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

  • బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు వచ్చే ఆదాయంలో 90 నుంచి 95 శాతం ఐసీసీ నుంచే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీతో విరోధం బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాదం.

  • టీ20 వరల్డ్‌కప్‌ విషయంలో ప్రజల్లో ప్రకటనలు చేసి రెచ్చగొట్టడం కంటే, బోర్డు లోపల చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొంటే మంచిది. మాట్లాడుకోవడం ద్వారానే సమస్యలు తీరతాయి.

  • భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్ మార్గాన్ని అనుసరించడం బంగ్లాదేశ్‌కు హానికరం. వారు చేశారని మనమూ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

  • ప్రపంచ కప్ నుంచి వైదొలగడం దేశ క్రికెట్ సంస్కృతిని దెబ్బతీస్తుంది.

తమీమ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌ నాయకులు, ఆ దేశ క్రికెట్‌ బోర్డు పెద్దలు అనురిస్తున్న విధానాలకు అద్దం పడుతున్నాయి. తమీమ్‌ మొదటి నుంచి విధానాల విషయంలో బీసీబీ పెద్దలను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. తాజా పరిణామాలపై అతను మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమీమ్‌ వ్యాఖ్యల్లో క్రికెట్‌ ముందు, రాజకీయాలు తర్వాత అన్న విషయం స్పష్టమవుతుంది.

భారత్‌-బంగ్లాదేశ్‌ ఉద్రిక్తతల నేపథ్యం
షేక్ హసీనా స్థానంలో మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి కావడంతో భారత్‌తో సంబంధాలు క్షీణించాయి. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు బంగ్లాదేశ్‌ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించింది.

ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అతిగా స్పందించింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. ముస్తాఫిజుర్‌ ఉదంతానికి ప్రతి చర్యగా భారత్‌లో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకుంది. అలాగే దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని తీర్మానించుకుంది. 

టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను భారత్‌కు బదులుగా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ కోరింది. ఐసీసీ ససేమిరా అంటుండటంతో వాకౌట్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతుంది. పాక్‌ అండ చూసుకొని, ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లే తమకు కూడా హైబ్రిడ్‌ విధానంలో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంది. మొత్తంగా బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌ను చూపిస్తూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement