పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కిడ్నాప్ చేయాలని కోరారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన తరహాలోనే నెతన్యాహును కూడా అపహరించాలని ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు టర్కీ కూడా ఈ పని చేయగలదని ఇజ్రాయెల్‌ను రెచ్చగొట్టేలా ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మానవత్వానికి పెద్ద నేరస్తుడిగా నెతన్యాహూను అభివర్ణించాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలకు చరిత్రలో ఏ దురాగతాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. గత 4-5 వేల సంవత్సరాల్లో పాలస్తీనియన్లకు నెతన్యాహు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని.. మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని అన్నారు. ప్రపంచంలో ఇంతకుమించిన పెద్ద నేరస్తుడిని ఎక్కడా చూడలేదన్నారు.
అయితే మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.


