
క్యూ2లో రూ.3,246 కోట్లు
ఆదాయం రూ. 22,697 కోట్లు
క్యూ3 అంచనా –0.5 నుండి +1.5%
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ.3,246 కోట్లను దాటింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.3,209 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 2 శాతం పుంజుకుని రూ.22,697 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా నికర లాభం 2.5 శాతం నీరసించగా.. ఆదాయం ఇదే స్థాయిలో బలపడింది.
మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సర్వీసుల ఆదాయం –0.5–+1.5 శాతం స్థాయిలో నమోదుకాగలదని కంపెనీ తాజాగా అంచనా వేసింది. వెరసి 259.1–264.4 కోట్ల డాలర్ల మధ్య ఆదాయ గైడెన్స్ ప్రకటించింది. అయితే ఇటీవల సొంతం చేసుకున్న హర్మన్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సొల్యూషన్స్ ఆదాయ అంచనాలను దీనిలో కలపకపోవడం గమనార్హం! ప్రస్తుతం డిమాండ్ వాతావరణం పటిష్టంగా కనిపిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. విచక్షణా వ్యయాలు ఏఐ ఆధారిత ప్రాజెక్టులవైపు మరలుతున్నట్లు వెల్లడించారు.
హెచ్1బీ వీసా ఫీజు ప్రభావం అంతంతే..
యూఎస్ ఉద్యోగులలో 80% స్థానికులే కావడంతో హెచ్1బీ వీసా ఫీజు పెంపు ప్రభావం నామమాత్రమేనని కంపెనీ సీహెచ్‌ఆర్‌వో సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. డిమాండ్ ఆధారంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ చేపట్టనున్నట్లు తెలియజేశారు.
క్యూ2లో ఇతర విశేషాలు..
2,260 మంది ఉద్యోగులు జతకావడంతో. సిబ్బంది సంఖ్య 2,35,492ను తాకింది.
2 మెగా రెన్యువల్స్, 13 భారీ డీల్స్ ద్వారా మొత్తం ఆర్డర్లు 31 శాతం జంప్‌చేసి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఐటీ సర్వీసుల మార్జిన్లు 16.7%గా ఉన్నాయి.
ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు