దలాల్ స్ట్రీట్‌లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి? | Dalal Street Nifty, Sensex Bleeds West Asia Tensions, What Should Investors Do Now? | Sakshi
Sakshi News home page

దలాల్ స్ట్రీట్‌లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?

Mar 5 2026 9:05 AM | Updated on Mar 5 2026 9:27 AM

Dalal Street Nifty, Sensex Bleeds West Asia Tensions, What Should Investors Do Now?

పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ  భారత స్టాక్ మార్కెట్లను చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండగా ఇటీవల దేశీయ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. నిన్న ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8.75 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు (1.40%) నష్టపోయి 79,116.19 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది 1,795 పాయింట్ల వరకు పడిపోవడం గమనార్హం. నిఫ్టీ 385.20 పాయింట్లు (1.55%) కోల్పోయి 24,480.50 వద్ద ముగిసింది. రంగాల వారీగా ఎనర్జీ సెక్టార్‌కు చెందిన షేర్లు అత్యధికంగా 14.90% పతనమయ్యాయి. రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు కూడా 3% పైగా నష్టపోయాయి.

మార్కెట్లు ఎందుకు కుప్పకూలాయి?

ముడి చమురు సెగ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడటం మార్కెట్లను భయపెట్టింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే ప్రమాదం ఉంది.

రూపాయి రికార్డు పతనం: అంతర్జాతీయ అనిశ్చితి వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి (92.17) పడిపోయింది. ఇది దిగుమతులపై భారాన్ని పెంచుతోంది.

ఎఫ్ఐఐల అమ్మకాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత మూడు సెషన్లలోనే దాదాపు రూ.14,400 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

ఆసియా మార్కెట్ల ప్రభావం: జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి వంటి ఇతర ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉండటం దేశీయ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇలాంటి సంక్షోభ సమయాల్లో భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భయం వద్దు.. మార్కెట్లు పడిపోగానే కంగారుపడి క్వాలిటీ షేర్లను విక్రయించకూడదు. యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తాత్కాలికమే. చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి పతనం తర్వాత మార్కెట్లు మరింత బలంగా పుంజుకున్నాయి.

సిప్‌ కొనసాగిచాలి: మార్కెట్ కనిష్టాల్లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీనివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం చేకూరుతుంది.

నగదు నిల్వలు: పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుకోవడం మంచిది. మంచి షేర్లు తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయడానికి ఇది మీకు ఒక అవకాశం ఇస్తుంది.

స్టాప్ లాస్ తప్పనిసరి: ట్రేడర్లు ట్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా స్టాప్ లాస్ పాటించాలి. మార్కెట్‌ సూచీల ఊగిసలాట ఎక్కువగా ఉన్నప్పుడు అధిక లివరేజ్ తీసుకోవడం రిస్క్‌తో కూడుకున్న పని.

ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే చమురు ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పునసమీక్షించుకోవాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమం.

ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement