
ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో 8,203 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,31,991కు చేరిందని చెప్పింది. ఇన్ఫీ క్యూ2 ఫలితాలను వెల్లడించిన క్రమంలో అందులోని వివరాల ప్రకారం..జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ.7,364 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.6,506 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ.44,490 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ.40,986 కోట్ల టర్నోవర్ అందుకుంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో 1–3 శాతం వృద్ధి(జూన్‌లో ప్రకటించిన) అంచనాలను తాజాగా 2–3 శాతానికి సవరించింది. నిర్వహణ మార్జిన్లు నామమాత్ర క్షీణతతో 21%గా నమోదయ్యాయి.
షేరుకి రూ.23 డివిడెండ్
వాటాదారులకు ఇన్ఫోసిస్ బోర్డు షేరుకి రూ.23 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈనెల 27 రికార్డు డేట్ కాగా నవంబర్ 7 కల్లా చెల్లించనుంది. దీనికితోడు రూ.18,000 కోట్ల విలువైన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) కోసం వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో జయేష్ సంగ్రాజ్‌కా తెలిపారు.
ఇతర విశేషాలు
క్యూ2లో 8,203 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో సిబ్బంది సంఖ్య 3,31,991ను తాకింది. 2025 జూన్ చివరికల్లా 3,23,788 మంది ఉద్యోగులున్నారు.
ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత క్యూ2లో నమోదైన 12.9 శాతం నుంచి 14.3 శాతానికి పెరిగింది.
ఈ కాలంలో 3.1 బిలియన్ డాలర్ల(రూ. 27,525 కోట్లు) విలువైన కాంట్రాక్టులను సాధించింది.
ఆదాయంలో ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం 5.6 శాతం వృద్ధితో 27.7 శాతం వాటాను ఆక్రమించింది.
తయారీ విభాగం 9.3 శాతం, హైటెక్ బిజినెస్ 8.3 శాతం, కమ్యూనికేషన్స్ 5.7 శాతం చొప్పున సమకూర్చాయి.
రిటైల్ నామమాత్రంగా నీరసించగా.. లైఫ్ సైన్సెస్ 9 శాతం క్షీణించింది.
ఉత్తర అమెరికా వాటా 1.7 శాతం పుంజుకుని ఆదాయంలో 56.3 శాతానికి చేరింది.
యూరప్ బిజినెస్ 10.6 శాతం ఎగసి 31.7 శాతం వాటాను ఆక్రమించింది. భారత్ వాటా 2.9 శాతమే.
ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?