
భారతదేశంలో నక్సల్స్/ మావోయిస్టులు లొంగిపోవడం అనేది నిరంతర ప్రక్రియ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాలు, ఇతర కొన్ని కారణాల వల్ల చాలా మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. అయితే ముఖ్య నేతలపై ఉండే భారీ నజరానా (రివార్డు)ను లొంగిపోయిన తర్వాత వారికి అందిస్తారు. ఈ నేపథ్యంలో లొంగిపోయిన నక్సల్స్‌కు ఇచ్చే నజరానాపై ఆదాయపు పన్ను (Income Tax) ఉంటుందా? అనే అనుమానం సహజంగా ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. తొలితరం మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను గడ్చిరోలి(మహారాష్ట్ర) పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. తనతోపాటు మరో 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
నక్సల్స్ లొంగుబాటు, నజరానా
నక్సల్స్‌కు ప్రభుత్వాలు ప్రకటించే లొంగుబాటు విధానంలో భాగంగా సాయుధ దళాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి పునరావాసం కల్పిస్తారు. ఈ విధానంలో లొంగిపోయిన నక్సల్స్‌కు, ముఖ్యంగా కీలక స్థానాల్లో ఉండి లొంగిపోయేవారికి వారి స్థాయి, హింసాత్మక చర్యల తీవ్రత ఆధారంగా ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతి (నజరానా/రివార్డు) ఇస్తుంది. లొంగిపోయిన తర్వాత సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు, ఇల్లు కట్టుకోవడానికి, వృత్తిపరమైన శిక్షణ పొందడానికి వారికి ఇది ఆర్థిక సాయంగా ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?
భారతదేశ ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ప్రభుత్వాల నుంచి పొందే కొన్ని రకాల అవార్డులు లేదా నజరానాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.
సెక్షన్ 10(17A): ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(17A) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా సంస్థ ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన అవార్డు లేదా నజరానా కింద నగదు రూపంలో, ఇతర రూపంలో పొందిన ఏదైనా చెల్లింపులపై పన్ను మినహాయింపు ఉంటుంది.
ప్రభుత్వ లక్ష్యం: నక్సల్స్ లొంగుబాటు అనేది ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన ఒక కార్యక్రమం. నక్సలిజాన్ని అంతం చేయడానికి, శాంతిని పునరుద్ధరించడానికి, హింసను విడిచిపెట్టినవారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఈ రివార్డులు, పునరావాస విధానాలు రూపొందించారు. ఈ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే నక్సల్స్ లొంగుబాటుపై ఇచ్చే నజరానా ప్రజా ప్రయోజనం కిందకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పునరావాస విధాన మార్గదర్శకాలు, కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించవలసి ఉంటుంది.
ఇదీ చదవండి: ధన త్రయోదశికి ముందే అంతులేని ధరలు