స్వరాష్ట్రం తెలంగాణలోనే లొంగిపోయే అవకాశం! సీఎంతో భేటీ సందర్భంగా పార్టీ అగ్రనేత గురించి చర్చ!
గౌరవప్రదంగా జరిగేలా అవకాశం ఇవ్వాలంటున్న తాజా, పాత మాజీలు
గణపతి ఆచూకీపై ఇప్పటికే తెలంగాణ పోలీసులకు కొంత స్పష్టత
ఆయన లొంగిపోతే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుందన్న ఉన్నతాధికారులు!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి లొంగుబాటుపై చర్చ తీవ్రమవుతోంది. ఓవైపు కేంద్ర హోంశాఖ విధించిన గడువు దగ్గర పడుతుండటం..మరోవైపు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాట పట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి గణపతి పైకి మళ్లుతోంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో మిగిలిన ముగ్గురిలో గణపతి ఒకరు కావడంతో.. మావోయిజం అంతం లక్ష్యంలో ఇది కీలకంగా మారింది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మావోయిస్టు కీలక నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మావోయిస్టు పార్టీ సుప్రీంగా, ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన గణపతి గౌరవప్రదంగా లొంగిపోయేలా అవకాశం ఇవ్వాలని, ఆయన వృద్ధాప్యం, అనారోగ్యం రీత్యా భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల లొంగిపోయిన తాజా, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇతర రాజకీయ అంశాలతో పాటు సీఎంతో భేటీలో ఈ అంశాన్ని సైతం దేవ్‌జీ, చంద్రన్న, మల్ల రాజిరెడ్డిలు ప్రభుత్వం దృష్టికి తెచి్చనట్టు సమాచారం. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన, తెలంగాణ స్థానికుడైన గణపతి తెలంగాణలో లొంగిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సైతం మంచి పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
నిర్బంధం పెరగడంతో లొంగు‘బాట’
మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించినప్పటి నుంచి మావోయిస్టు కీలక నేతలు ఉండేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ సాయుధ పోలీసు బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. నిర్బంధం పెరగడంతో పలువురు నేతలు సహా మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాటు (సరెండర్) పాలసీ పక్కాగా అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లొంగిపోయేందుకు మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల లొంగుబాట్లు చోటు చేసుకున్నాయి. తాజాగా ఉద్యమ ప్రస్థానానికి తెలంగాణలోనే ముగింపు పలకాలని గణపతి సైతం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఎక్కడ ఉన్నారనే చర్చ
వృద్ధాప్యం, అనారోగ్యంతో 2018లో పార్టీ సారథ్యాన్ని నంబాల కేశవరావుకు అప్పగించిన గణపతి, అప్పటి నుంచి దండకారణ్యానికే పరిమితం అయ్యారు. అయితే గత కొన్నేళ్లుగా వరుస ఎన్‌కౌంటర్లతో సాయుధ పోలీసు బలగాలు మావోయిస్టులపై పూర్తి స్థాయిలో పట్టుసాధిస్తుండడంతో ముందుగానే అప్రమత్తమైన మావోయిస్టు అగ్రనాయత్వం గణపతిని సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో అప్పటివరకు మావోయిస్టు పారీ్టకి మార్గనిర్దేశనం చేస్తూ వచి్చన గణపతి బయటి పరిస్థితుల నేపథ్యంలో అగ్రనాయత్వంతో సైతం టచ్‌లో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేపాల్‌లో తలదాచుకున్నారని...లేదు ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఉంచొచ్చని ఇలా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కానీ గణపతి ఎక్కడ అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
నమ్మకాన్ని పెంచుతున్న తెలంగాణ పాలసీ
ఇటీవల లొంగిపోయిన కీలక నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ , మల్ల రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, పోతుల కల్పన అలియాస్ సుజాత, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తదితరుల లొంగుబాటు విషయంలో.. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇచి్చన మాటను నిలుపుకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం లొంగుబాట్ల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుండటం మావోయిస్టు నేతల్లో నమ్మకాన్ని పెంచింది. ఈ కారణంగానే తెలంగాణ స్థానికుడు జగిత్యాల జిల్లా బీర్పూర్‌కు చెందిన గణపతి సైతం ఇక్కడే లొంగిపోతే మంచిదనే అభిప్రాయం మాజీ మావోయిస్టుల్లోనూ వ్యక్తం అవుతున్నట్టు సమాచారం.
దేవ్‌జీ సహా ఇతరుల లొంగుబాటు సందర్భంగా గణపతి జాడపై మీడియా అడిగిన ప్రశ్నకు డీజీపీ శివధర్‌రెడ్డి బదులిస్తూ.. గణపతి అడవుల్లో లేరని, మైదాన ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉందని చెప్పిన నేపథ్యంలో గణపతి ఆచూకీపై పోలీసులకు కొంత స్పష్టత ఉందనే విషయం అర్థమవుతోంది. తాజాగా శుక్రవారం జరిగిన సమావేశంలోనూ గణపతి ప్రస్తావన వచి్చనట్టు తెలుస్తుండటంతో ఆయన కూడా త్వరలో తెలంగాణలోనే లొంగిపోయే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో లొంగిపోయిన మావోయిస్టులు చంద్రన్న, సుజాతక్కలు సైతం శుక్రవారం నాటి సమావేశంలో పాల్గొనడం గమనార్హం.


