జీఐ ట్యాగింగ్ బస్సులను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్ హరిచందన తదితరులు
జీఐ ట్యాగింగ్ బస్సులను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అఫ్జల్‌గంజ్ : చరిత్రను భావితరాలకు అందజేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భౌగోళిక గుర్తింపు పొందిన తెలంగాణ సాంస్కృతిక కళావైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. అందుకోసం ఆర్టీసీ బస్సులను సాంస్కృతిక కళాసారథులుగా అలంకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన జీఐ ట్యాగింగ్ బస్సులను రాష్ట్ర రవాణాæ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిలతోకలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని, సంస్కృతి సమాజానికి ఆత్మస్వరూపమని, సాంస్కృతిక అవగాహన లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ మాట్లాడుతూ జీఐ ఉత్పత్తులకు ప్రాచుర్యం కలి్పంచేందుకు, మార్కెటింగ్ విస్తరణకు, ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీంతో గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. ఆర్టీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు (కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ(వెండితీగ పని), నారాయణపేట్ చీరలు, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ వంటి తెలంగాణకు చెందిన ఆరు ప్రముఖ జీఐ హస్తకళలను బస్సులపై ప్రత్యేకంగా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం గవర్నర్ ఆలోచనల ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, సీహెచ్.వెంకన్న,విజయపుష్ప,రాజశేఖర్,ఖుస్రో షా ఖాన్, రీజినల్ మేనేజర్లు శ్రీలత, సుధ పరిమళ తదితరులు పాల్గొన్నారు.


