GI
-
వీళ్ళు బయట మనల్ని ఎలా చూపుతున్నారు?
తెలుగు ప్రజలు రెండుగా విడిపోయి పదేళ్ళు అయింది. ఈ అనుభవం తర్వాత కూడా ఇంకా మనగురించి మనం చెప్పు కునేప్పుడు; ‘నేను’ అనాలా, లేక ‘మేము’ అనాలా అనే మీమాంస అలాగే ఉంది. ఇది ‘జీఐ’ (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ) అనే మన భౌగోళిక గుర్తింపు దృష్టి నుంచి అంటున్న మాట. సీఎం అంటేనే ‘ప్రభుత్వం’ అయినప్పుడు, రాష్ట్ర ‘ప్రజలు’, ‘ప్రాంతము’– ఈ రెండింటికి ఆయన ప్రతినిధి. అటువంటిది, ఏపీ గురించి ముఖ్యమంత్రి బయట మాట్లాడేటప్పుడు, ఆయన రాష్ట్ర ప్రజలైన మనల్ని కూడా కలుపుకుని ‘మన’ అంటున్నారా, లేక తనమట్టుకు మాత్రమే పరిమితం చేసుకుని ‘నేను’ అంటున్నారా? ఇటీవల పార్లమెంట్లో జరిగింది చూసినప్పుడు, ఈ అంశం చర్చించకుండా ఉండలేకపోతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ చారిత్రక వైభవాన్ని పరిరక్షించి మన ‘హెరిటేజ్’ని కొత్త తరాలకు చేర్చే ‘ఆర్కియాలజీ’ శాఖ పనితీరు గురించి, దానికి నిధుల కేటాయింపు గురించి చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు (కూటమి) ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. ‘అందుకు కారణం కేంద్రం వద్ద నిధులు లేకపోవడం కాదు, మీ రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి రానందున, మీ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు’ అని మంత్రి అన్నారు. తరుచూ ‘టూరిజం’ చుట్టూ పెరిగే వృద్ధి గురించి, దాని విస్తరణ గురించి మాట్లాడే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇటువంటి లోపానికి కారణం ఏమిటి అని చూస్తే, మళ్ళీ అది మరొక ‘అకడమిక్’ అంశం అవుతున్నది. సామాజిక శాస్త్రాలకు తల్లి వంటి చరిత్ర కనుక ఈ ప్రభుత్వానికి గుర్తు ఉండివుంటే, పురావస్తు శాస్త్రం (ఆర్కియాలజీ) దానితో జంటగా కలిసే ఉంటుంది కనుక, అది కూడా వారికి గుర్తు ఉండి ఉండేది. మూడు దశాబ్దాల క్రితం సామాజిక శాస్త్రాల చదువులు అక్కరలేదు అనే వైఖరి ఈ ప్రభుత్వం తీసుకుంది కనుక; ఇక ఇప్పుడు వారికి ‘టూరిజం’ అంటే హోటళ్లు, కాటేజీలు, ‘ఫుడ్’, వినోదం, విలాసం మాత్రమే ‘టూరిజం’ అవుతుంది. అందుకే గడచిన పదేళ్ళలో ఇంకా దొరకాల్సిన చరిత్ర కోసం ఇక్కడ వెతకాలని, అందుకు ‘ఆర్కియాలజీ’ కార్యకలాపాలు అవసరం అని ఈ ప్రభుత్వం అనుకోలేదు. ఢిల్లీలో మార్చి 5–7 మధ్య ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ జరిపిన పదకొండవ ‘రైసీనా డైలాగ్– 26’ సదస్సులో మన తీరు కూడా అటువంటిదే. పైగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ దీనికి స్పాన్సర్ కూడా. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సదస్సుకు ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం ఇచ్చారు. బీజేపీ తన ముద్రకోసం దాన్ని – ‘సంస్కార’ అనే బ్యానర్ కింద జరిపినా ‘ధ్రువీకరణ, వసతి, పురోగతి’ అనే మూడు అంశాల దృష్టితో ఇది జరిగింది. కానీ కొత్త రాష్ట్రానికి ప్రతినిధిగా మాట్లాడిన ఏపీ సీఎం బాబు వెయ్యి కిలోమీటర్ల తీరం ఉన్న ఈ రాష్ట్రం ఉనికిని ఇతరులకు అదొక భౌగోళిక అవకాశంగా ఆ వేదికపై చూపలేదు. దీని పర్యాటక ప్రాధాన్యం గురించి అక్కడ చెప్పకుండా పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాన్ని చేజేతులా వదిలివేశారు. ఆ వేదికమీద నుంచి ‘ప్రపంచం అంతా ఇండియన్స్ ఉన్నారు, సిలికాన్ వ్యాలీ, అమరావతి ‘టెక్నాలజీ హబ్’, ‘ఏఐ’, ‘డేటా సెంటర్’, ‘క్వాంటమ్ వ్యాలీ’, ‘వరల్డ్ క్లాస్ ఎకో సిస్టం’ అంటూ చెప్పాక, చివరికి ఈ మధ్య మన జిల్లాల్లో ఎక్కువ పిల్లల్ని కనండి అని చెబుతున్నట్టుగా, అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకు 25 వేలు ఇస్తాము అని చెప్పేశారు. పైగా దీన్ని– ఫైవ్ పిల్లర్ మోడల్’ అని వెల్లడించారు. అంటే– అమ్మా నాన్న, ముగ్గురు పిల్లలు కలిసి ‘ఐదు స్తంభాలు నమూనా’ అని. పైగా ఇది ‘పాపులేషన్ కేర్’ కార్యక్రమం అని కూడా అన్నారు. అయితే, ఇందులో ఎక్కడ ‘మనం’ ఉన్నామో వెతకడం ఎలా?జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
చరిత్రను భావితరాలకు అందజేయడం మన బాధ్యత
అఫ్జల్‌గంజ్ : చరిత్రను భావితరాలకు అందజేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భౌగోళిక గుర్తింపు పొందిన తెలంగాణ సాంస్కృతిక కళావైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. అందుకోసం ఆర్టీసీ బస్సులను సాంస్కృతిక కళాసారథులుగా అలంకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన జీఐ ట్యాగింగ్ బస్సులను రాష్ట్ర రవాణాæ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిలతోకలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని, సంస్కృతి సమాజానికి ఆత్మస్వరూపమని, సాంస్కృతిక అవగాహన లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ మాట్లాడుతూ జీఐ ఉత్పత్తులకు ప్రాచుర్యం కలి్పంచేందుకు, మార్కెటింగ్ విస్తరణకు, ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీంతో గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. ఆర్టీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయనున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు (కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ(వెండితీగ పని), నారాయణపేట్ చీరలు, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ వంటి తెలంగాణకు చెందిన ఆరు ప్రముఖ జీఐ హస్తకళలను బస్సులపై ప్రత్యేకంగా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం గవర్నర్ ఆలోచనల ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, సీహెచ్.వెంకన్న,విజయపుష్ప,రాజశేఖర్,ఖుస్రో షా ఖాన్, రీజినల్ మేనేజర్లు శ్రీలత, సుధ పరిమళ తదితరులు పాల్గొన్నారు. -
లోకల్ టు గ్లోబల్!
సాక్షి, హైదరాబాద్: చేనేత, హస్తకళలతోపాటు వ్యవసాయ రంగంలో ఘన సాంస్కృతిక వారసత్వాన్ని, నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. తెలుగు నేలపై ప్రత్యేకత సంతరించుకున్న మరికొన్ని ఉత్పత్తులకు ఈ ఏడాది భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి మరో 10 ఉత్పత్తులు, ఏపీ నుంచి ఇంకో 12 ఉత్పత్తులు జీఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుకు రానున్నాయి.ఈ మేరకు ఆయా చేనేత, హస్తకళల గుర్తింపు కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ ఉత్పత్తులకు గుర్తింపు కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయం, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే తెలంగాణలో 17 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించగా ఏపీలో 19 ఉత్పత్తులకు జీఐ హోదా లభించింది. తాజా ప్రతిపాదనలకు కూడా జీఐ ట్యాగ్ లభిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 58 ఉత్పత్తులకు ఆ ఘనత లభించినట్లు అవుతుంది.తెలంగాణ నుంచి జీఐ దరఖాస్తులివీ.. హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు, నారాయణపేట ఆభరణాల తయారీ కళ, మెదక్‌కు చెందిన బాటిక్ పెయింటింగ్, నల్లగొండలోని బంజారా కుట్లు–అల్లికలు, బంజారా గిరిజన ఆభరణాలు, బాలానగర్ సీతాఫలం, నల్లగొండ దోసకాయ (ఓరియెంటల్ పిక్లింగ్ మెలన్), అనబ్–ఈ–షాహీ ద్రాక్ష, ఖమ్మం మిర్చి.ఏపీ నుంచి జీఐ దరఖాస్తులివీ.. తిరుపతిలోని మాధవమాల హస్తకళా శిల్పాలు, జమ్మలమడుగులోని డూపియన్ సిల్‌్క, వైఎస్సార్ కడపలోని మాధవరం కాటన్ అండ్ సిల్క్ చీరలు, పోలవరం చీరలు, బొబ్బిలి చీరలు, కడపగుంట తెల్లజిల్లేడు చెక్క విగ్రహాలు, పాలమ్నేరు టెర్రకోట, సుగంధాల అరటి, మైదుకూరు పసుపు, పోలూరు వంకాయ, దుర్గాడ మిర్చి, కాకినాడ గులాబీ.జీఐ గుర్తింపు ఎందుకు? మన సంప్రదాయాన్ని, ఆర్థికాభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే సాధనమే జీఐ. దీనివల్ల నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి పరిరక్షించడం వీలవుతుంది. ప్రస్తుతం దేశంలో 1,408 ఉత్పత్తులు జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా వాటిలో 658 ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి.చట్టపరమైన రక్షణ.. భౌగోళిక గుర్తింపు వల్ల ఆయా ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అలాగే వాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా ఉత్పత్తుల ఎగుమతితో ఉత్పత్తిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. జీఐ ఉత్పత్తులకు ఉండాల్సిన అర్హతలు ఇవే.. ⇒ ఆయా ఉత్పత్తి తప్పనిసరిగా స్థానిక భౌగోళిక ప్రాంతానికి చెందినదై ఉండాలి⇒ భౌగోళిక స్థానంతో కొంత అనుసంధానమై ఉండాలి ⇒ స్థానికంగా, జాతీయంగా లేదా ప్రపంచ స్థాయిలో ఖ్యాతిని కలిగి ఉండాలి⇒ ఆయా ఉత్పత్తులకు చారిత్రక ఆధారాలు, ఉనికి కలిగి ఉండాలి⇒ ఇతర ఉత్పత్తులతో కొంత ప్రత్యేకత కలిగి ఉండాలి⇒ స్థానిక సంఘం ద్వారా తయారై లేదా ఉత్పత్తి అయి ఉండాలిజీఐ గుర్తింపుతో వారసత్వ పరిరక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన వారసత్వం, విలువలు, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేవి సాంస్కృతిక, హస్త, చేనేత కళలే. జీఐ గుర్తింపుతో ఉత్పత్తుల వారసత్వ పరిరక్షణతో పాటు ప్రపంచ దేశాలలో వ్యాపార డిమాండ్‌కు అవకాశం ఏర్పడుతుంది. – సుభాజిత్ సాహా, జీఐ ప్రాక్టీషనర్ -
సుగర్ ఫ్రీ రైస్ లేనే లేదు !
మార్టేరు (పెనుగొండ రూరల్): మార్కె ట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా సుగర్ ఫ్రీ రైస్ అసలు లేనే లేదని మార్టేరు వరి పరిశోధన సంస్థ డెరైక్టర్ డాక్టర్ పాల డుగు వెంకట సత్యనారాయణ స్పష్టం చేశారు. మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థలో గోదావరి మండ లం పరిశోధన, విస్తరణ సలహామండలి రెండవరోజు సమావేశంలో ఆ యన ప్రసంగించారు. ఆర్ఎన్ఆర్ 15048 రకాన్ని సుగర్ ఫ్రీ రకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఇది వాస్తవం కాదన్నారు. జీఐ(గ్లైసమిక్ సూచిక )లో ఇది మధ్యస్త రకం మాత్రమేనని పాలడుగు అన్నారు. మధుమేహ నియంత్రణ పరంగా వరి రకాలను మధ్యస్త, హెచ్చురకాలుగా విడదీశామన్నారు. ఈ సూచిక ప్రకారం ఆర్ఎన్ఆర్ కన్నా సాంబమసూరే సుగ ర్ రోగులకు మేలైనదన్నారు. ఆర్ఎన్ఆర్ 15048లో 57 శాతం జీఐ ఇండెక్స్ ఉంటే, బీపీటీ 5204 (సాంబ మసూరి)లో 52 శాతం, స్వర్ణ రకంలో 56 శా తం ఉందన్నారు. వరిలో సుగర్ ఫ్రీ రైస్ ఉండదన్నారు. చక్కెర తక్కువ శాతం ఉండే రకాలు మాత్రమే ఉంటాయన్నారు. తక్కువ చక్కెర శా తం రకాలపై ఎన్ఐఎన్ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సత్ఫలితాలు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు ఎలుకల నివారణ, మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారం, చిరుధాన్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సాయిల్ మేనేజ్మెంట్ ప్రత్యేకాధికారి టి గిరిధర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏడీఆర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరెడ్డి, వ్యవసాయ శాఖ ఉభయగోదావరి జిల్లా డీడీఏలు పద్మ, లక్ష్మణరావు, శాస్త్రవేత్తలు ఎంవీ రమ ణ, రత్నకుమారి, కె.శ్రీనివాసులు, సుధీర్, ఎం. శ్రీనివా స్, శిరీష, చాముండేశ్వరి పాల్గొన్నారు. -
పలాస జీడి..జిందాబాద్
జీఐ సాధనకు సహకరిద్దాం పేరొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దాలి దేశంలోనే పలాస జీడిపప్పు నెంబర్-1 పేటెంట్ హక్కు వస్తే రైతులకు, వ్యాపారులకు ప్రోత్సాహం శ్రీకాకుళం : పలాస జీడిపప్పు పేరెత్తగానే నోరూరుపోతుంది. అలాంటి జీడిపప్పుకు ఇప్పుడు ఓటేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పేరొందిన ఐదు ఉద్యాన వన పంటలకు జీఐ మార్కు సాధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. జిల్లా యంత్రాంగం, స్థానికులు, అధికారులు, వ్యాపారులు ఇప్పుడు పలాస జీడిపప్పుకు సంబంధించి మరోమారు గొప్పతనాన్ని చాటడం ద్వారా భవిష్యత్తులో మరో ట్రేడ్‌మార్క్ సాధించే అవకాశం ఉంది. పేటెంట్ హక్కుల సాధనకు రాష్ట్రంలో పేరొందిన బంగినపల్లి మామిడి, చక్కెరకేళి అరటి, దుగ్గిరాల పసుపు, పలాస జీడిపప్పు, కర్నూలు ఉల్లికి సంబంధించి జీఐ (భౌగోళిక గుర్తింపు) సాధనకు ఉద్యానవనశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలొచ్చాయి. చెన్నైలో ఈ ఐదు రకాల గుర్తింపునకు రిజిస్ట్రేషన్ అవసరమై పలాస పరిధిలో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ఎగుమతి, దిగుమతికే అవసరమైన పలాస జీడిపప్పుపై ఇప్పుడు ప్రత్యేక చర్చ అవసరమైంది. పలాస జీడిపప్పు పుట్టుకు ఇక్కడే అని నిరూపించుకుంటే దేశంలోనే నెంబర్-1అయ్యే పరిస్థితితోపాటు ట్రేడ్‌మార్క్ సాధనకు వీలుంటుంది. పేటెంట్ హక్కు పొందడం ద్వారా రైతులకు, వ్యాపారులకు మరింత లబ్ది చేకూరే అవకాశం ఉంది. పలాస జీడిపప్పుకు డిమాండ్ ఉంది. పిక్కల నుంచి పప్పును వేరు చేసేందుకు పలాస ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక పద్ధతుల్ని ఉపయోగిస్తుంటారు. ఏళ్ల నుంచి ఈ పరిశ్రమ ఇక్కడ అలరారుతోంది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస (ఉద్దానం)ప్రాంతాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30వేల మంది జీడిపరిశ్రమపై ఆధారపడుతున్నారు. పలాస క్యాష్యూ మేనుఫ్యాక్చరర్స్ పేరిట 500మంది వ్యాపారులున్నారు. మూడేళ్ల వ్యవధిలో జీడి మొక్క ఏపుగా పెరిగి పంటని స్తుంది. లక్షల ఎకరాల్లో జీడి పంట సాగవుతోం ది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వానికి పన్నురూపంలో ఆర్థికంగా బలపడాలంటే పలా స జీడిపప్పునకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇక్కడి వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు. మనమేం చేయాలి? జీడిపంట ఇక్కడే ప్రాధాన్యం అంటూ ఉద్యానవనశాఖ అధికారులు థృవీకరించాలి. ఈ పంట మూలాలు ఇక్కడే ఉన్నాయని పేర్కొనాలి. పంట విస్తీర్ణం, దిగుబడి లెక్కలు చూపించాలి. రైతులు పండిస్తున్న పంట ఫోటోలు పంపించాలి. పరిశ్రమ ఎదుగుతున్న తీరు కళ్లకు కనబడేలా గణాంకాలివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీడి పరిశ్రమ కష్టసుఖాల్ని వివరించాలి. జిల్లా యంత్రాంగం సహకారంతో తోటి వ్యాపారులు, స్థానిక నేతల ఆధ్వర్యంలో త్వరలోనే ఉద్యాన వన శాఖ అధికారులకు పలాస జీడిపప్పు ప్రత్యేకతపై ఓ నివేదిక సమర్పిస్తామని ‘ది పలాస క్యాష్యూ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్’ కార్యదర్శి మళ్ల సురేష్ కుమార్ ‘సాక్షి’కి చెప్పారు.


